10 March, 2026 | 2:30 AM

నానో వినియోగం తగ్గిద్దాం! పర్యావరణాన్ని కాపాడుదాం!

10-03-2026 12:30 AM

కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు ‘ఆత్మ‘ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

చేవెళ్ళ, మార్చి 9 (విజయక్రాంతి): చేవెళ్ల రైతు వేదికలో వ్యవసాయశాఖ, ‘వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ‘ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతా వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్  పాల్గొన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం నుండి ఉద్యాన శాస్త్ర వేత్త డా. శ్రీకృష్ణ, పండ్లు ,పూల, కూరగాయ పంటల సాగులపై సంబంధించిన యాజమాన్య పద్ధతులపై సలహాలు సూచనలు ఇచ్చారు. కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డా.దిలీప్ నానో ఎరువుల వినియోగం వివరిస్తూ... నానో యూరియా, నానో డి.ఏ.పీ వంటి ఎరువుల సరైన మోతాదులో పిచికారీ చేస్తే పంటల ఎదుగుదలతో పాటు ఎరువుల ఖర్చు తగ్గుతాయని చెప్పారు. పర్యావరణానికి హాని కలక్కుండా ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.

చేవెళ్ల ఏడిఏ మాట్లాడుతూ... చిరుధాన్యాల సశ్యరక్షణ చర్యలు వివరించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ)లో భాగంగా రైతులకు ఎంఏఓ శంకర్ లాల్ , హెచ్టీ (హెర్బిసైడ్ టోలరెంట్ పత్తి) పత్తి సాగు వల్ల కలిగే ప్రతికూలతలు పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, హెచ్టీ పత్తి విత్తనాలను రైతులు వాడడం వలన గ్లైఫోసేట్ (Glyphosate) అనే కలుపు మందు వాడకం పెరిగి వాతావరణం కలుషితమై జీవ వైవిధ్యం దెబ్బతింటుందని స్పష్టం చేశారు.

అలాగే ఇతర పత్తి హైబ్రిడ్లు కూడా కలుషితం అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ చేవెళ్ల దేవర వెంకట రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాము గౌడ్, ఏఈఓలు బాల కోటేశ్వరరావు, రమ్య, ప్రతిభ, మౌనిక, వరుణ్ కుమార్ రైతులు పాల్గొన్నారు.