ఊరిని ఏలేద్దామని..!
యాదాద్రి భువనగిరి, మే 25 (విజయ క్రాంతి) : అసెంబ్లీ సమరం అయిపోయింది. లోక్‌సభ యుద్ధం ముగిసినట్టే. ఇక ముందున్నది పంచాయతీ ఎన్నికలే. తమతమ ఊళ్ల ను ఏలేద్దామనే ఆశతో ఉన్న చిన్నాచితక లీడర్లంతా పంచాయతీ పోరుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆశావహులు సర్దుకుం టున్నారు. మూటాముల్లె తయారు చేసుకుంటున్నారు. మరోపక్క అధికారులు సైతం పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించడం పల్లెల్లో సంగ్రామ వాతావరణం నెలకొంది.
స్థానిక నాయకుల్లో ఉత్కంఠ
పంచాయతీ ఎన్నికలు ముంచుకురానున్నాయనే సమాచారంతో స్థానిక నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో 421 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలో 3,366 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో పోటీ చేయడానికి ప్రధాన రాజకీయ పార్టీల్లో గ్రామ స్థాయి ముఖ్యనేతలు ఇప్పటికే రంగం సిద్దం చేసుకుంటున్నారు. పార్టీల మద్దతు కోసం అధినాయకుల అండదండలను పొందడానికి తాపత్రయం పడుతున్నారు. హైదరాబాద్ నగర శివారు జిల్లాగా రియల్ ఎస్టేట్, పారిశ్రామిక ప్రభావం కారణంగా పంచాయతీ పాలక వర్గ పదవులు కీలకంగా మారాయి. ఈ పదవుల కోసం అర్ధ బలం కూడ సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల ఆధారంగానే ఆయా గ్రామాల్లో ఎన్నికల ఖర్చులకు సంసిద్ధమవుతున్నారు. జిల్లాలో పంచాయతీలకు పాతిక లక్షల రూపాయలు మొదలుకొని రెండు కోట్ల వరకు ఎన్నికల ఖర్చు అవుతుందని ఆశావాహులు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే గ్రామల్లో స్థానిక సమరం వేడి రాజుకుంది. దీంతో గ్రామీణ రాజకీయాల్లో మరో ఎన్నికల కోలాహలం నెలకొంది.
రిజర్వేషన్లపై సందిగ్ధత
పంచాయతీ ఎన్నికలు జూన్, జులైలో ఎప్పుడైనా జగవచ్చుననే సంకేతాలు వస్తున్నప్పటికీ, స్థానిక నేతల్లో రిజర్వేషన్లపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. 2019లో పంచాయతీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లు రెండు టర్మ్‌ల వరకు కొనసాగుతాయని నిర్ణయించింది. దీని ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 47, ఎస్సీలకు 62, బీసీలకు 111 పంచాయతీలు కేటాయించారు. జనరల్ కేటగిరీలో 180 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి కేటగిరీలో మహిలలకు 50 శాతం రిజర్వు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ్ల బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. బీసీ సంఘాలు కూడా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వెళ్తుందా? బీసీ సంఘాల డిమాండ్ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టడానికి మొగ్గు చూపుతుందా? ఒకవేళ బీసీల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గితే.. పంచాయతీ ఎన్నికలు జూన్‌లో జరిగే అవకాశం తక్కువే!






