7 August, 2026 | 9:50 AM

నకిలీ విత్తనాలపై ఖాకీల డేగ కన్ను

26-05-2024 03:33 AM

మెదక్, మే 25 (విజయక్రాంతి)/జహీరాబాద్ : జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్మి రైతులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి దేశానికి తిండిపెట్టే రైతులను మోసం చేస్తూ కొంతమంది దళారులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారని, అలాంటి వారిపై నిఘా పెట్టామని తెలిపారు. జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా తనిఖీ నిర్వహిస్తూ పక్కా సమాచారంతో ఎవరైనా నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాలు జరిపితే వారిపై దాడులు నిర్వహిస్తామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు.

నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించామని, వారి ద్వారా మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు చేపడుతామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు గానీ ఇంకా ఏమైనా విత్తనాలు గానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వస్తే డయల్ 100కి ఫోన్ చేయాలని కోరారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి తనిఖీ చేయాలన్నారు. 

నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

వానాకాలం సీజన్‌లో పంటలు సాగుచేసేందుకు అవసరమయ్యే విత్తనాల కొనుగోలు చేసేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ మండల వ్యవసాయాధికారి ప్రవీణా సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని రాయిపల్లి(డి), శేఖాపూర్, హోతి(బి) గ్రామాల్లో రైతులతో సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అవసరాలను అసరా చేసుకని కొందరూ వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు గ్రామాలకు వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటి వాళ్లు గ్రామాల్లోకి వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.