8 August, 2026 | 10:39 PM

సాగు రుణాలపై ఉదారత అవసరం

20-06-2024 02:39 AM
  • నిరుపేద, మధ్యతరగతి వర్గాలకూ అప్పులివ్వాలి
  • పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్
  • ఆయిల్‌ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలి
  • గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు పెరగాలి
  • బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు భట్టి, తుమ్మల

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహ రిం చాలని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బ్యాంకర్లకు సానుకూల దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రమూ అభి వృద్ధి చెందదన్నారు. అందుకే బ్యాంకర్లకు సామాజిక, మనవీయ కోణం ఉండాలన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముం దుకు రావాలని కోరారు. సామాజిక అజెండానే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో బుధవారం నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ యువ రాష్ట్రమని, అలాగే బాగా అభివృద్ధి చెందుతున్న స్టేట్ అని పేర్కొన్నారు. ప్రపంచానికి తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామం అన్నా రు. ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, చౌకగా మానవ వనరులు, మంచి వాతావరణం, ఫ్రెండ్లీ గవర్నమెంట్, కాస్మొపాలిటన్ సిటీతో పాటు ఇక్కడ భాషా సమస్య కూడా లేదన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, కోర్ ఇండస్ట్రీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇతర క్లస్టర్లు అభివృద్ధి చెందాయని భట్టి పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంతో రాష్ట్ర రూపు రేఖలు మారిపోనున్నాయన్నారు. అతిపెద్ద రీజినల్ రింగ్ రోడ్డుతో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా మూడు ప్రాంతాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

ప్రభుత్వ బ్యాంకుల వెనుకంజ

దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో రుణాలు అందించి ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. బలహీన వర్గా లకు రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు. సబ్సిడీ పథకాలకు సం బంధించి ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తున్నా బ్యాంకర్లు సహకరించడం లేదన్నారు. బ్యాంకర్లు మంజూరు చేసినా సబ్సిడీ మొత్తం విడుదలలో జాప్యం జరుగుతుందన్నారు. రుణాల విషయంలో ప్రైవేట్ బ్యాం కులు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ, జాతీయ బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని భట్టి అన్నారు. జాతీయ బ్యాంకుల బ్రాంచీల సంఖ్య తగ్గడం సరికాదన్నారు. రైతులకు ఇన్‌పుట్స్, ఫైనాన్స్ అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. కానీ, ఉద్దేశించిన ప్రయోజనాలను రైతులు పొందడం లేదన్నారు. దీనిపై బ్యాంకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. గ్రామీణ బ్యాంకింగ్ స్ఫూర్తిని కోల్పోవద్దని వివరించారు. అన్నదాతను ఆర్థికంగా ఎలా శక్తిమంతం చేయాలో ఆలోచించాలని సూచించారు. 


గ్రామాల్లో సేవలు పెంచండి : మంత్రి తుమ్మల

రాష్ట్రంలో వివిధ బ్యాంకుల శాఖలు 6,415 వరకు ఉన్నాయని, ఇందులో కేవలం 1,874 మాత్రమే గ్రామాల్లో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామాల్లో బ్యాంకుల శాఖలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు తోడ్పాటు అందించే విధంగా ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత భద్రాద్రి జిల్లాలో అన్ని గ్రామాల్లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చినందుకు మంత్రి అభినందించారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యురిటీ/ ఇన్సూరెన్స్ పథకాలకు కేవలం ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్ మాత్రమే చూపిస్తున్నారని చెప్పారు. అకాల మరణం సంభవించినపుడు వారి కుటుంబాలను ఆదుకునే పథకాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదని, వాటి గురించి బ్యాంకర్లు అవగాహన కల్పించాలన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి గతేడాది కంటే 13,000 కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికి చిన్న, సన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు చిన్న, సన్నకారు రైతుల వద్దనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన అవశ్యకత ఉన్నదన్నారు. సాగు రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చే రుణాల శాతం కూడా 100 శాతానికి చేరాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుకు బ్యాంకుల నుంచి ప్రోత్సాహం కరువైందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 59,261 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగులోకి తేవడం వల్ల, ఆర్‌ఐడీఎఫ్ కింద నాబార్డ్ రూ.221.00 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 18,654 మంది రైతులు ఈ సాగు చేపడితే కేవలం 50 మందికే రుణాలు మంజూరు చేయడం శోచనీయమన్నారు. బ్యాంకులు ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి ఆ దిశగా పనిచేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలపైనా బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. 

రైతులకు అండగా ఉంటాం

తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం ఇస్తున్నామని భట్టి చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు కొన్ని పంటలకు బోనస్ కూడా అందిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పాదకత పెరగడం ద్వారా ఇథనాల్ పెట్రోలియం ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ఆయిల్ ఫామ్ రైతులకు రూ.100 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.