పటాన్ చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు
హైదరాబాద్: మైనింగ్ వ్యాపారానికి సంబంధించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్, ఆయన సోదరుడు జి. మధుసూధన్ రెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. నిజాంపేటలోని బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. పటాన్ చెరులోని 3 చోట్ల, నిజాంపేటలో రెండు చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది.
అక్డారం గనుల వ్యవహారంలో గతంలో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదైంది. గనుల కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో గతంలో మధుసూదన్ రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో పరిమితికి మించి తవ్వకాలు జరిపారని కేసు ఉంది, పటాన్ చెరు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మధుసూదన్ రెడ్డి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ యజమానిగా ఉన్నారు.






