విమోచనమా.. విలీనమా.. విద్రోహమా!
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యవాదుల(British imperialists) నుంచి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం(Independence) సిద్ధించినా తెలంగాణ(Telangana)కు మాత్రం అప్పుడు స్వాతంత్య్రం లభించలేదు. నాడు హైదరాబాద్ స్టేట్(Hyderabad State)లో నిరంకుశ నిజాం పరిపాలన(Nizam Rule) సాగేది. కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తెలంగాణ సాయుధ పోరాటం(Telangana Armed Struggle) చేశారు. విసిగివేసారిన సామాన్య ప్రజలు సైతం నిజాంపై తిరగబడ్డారు. భైరాన్‌పల్లి(Bhairanpalli), చ్‌రాన్‌పల్లి షాపూర్, కడవెండి, సంస్థాన్ నారాయణపూర్‌లో జాగిర్దార్లు, పటేల్(Patels), పట్వారీలు, భూస్వాములపై ప్రజలు పోరాడి తమ గ్రామాలను విముక్తి గ్రామాలుగా ప్రకటించారు.
ఈ క్రమంలో ఖాసీం రజ్వీ ప్రైవేటు సైన్యంతో ప్రజలను ఊచకోత కోశాడు. దీంతో 1948 సెప్టెంబర్ 17న అప్పటి భారత ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ నిర్వహించి హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపారు. నాటి హైదరాబాద్ స్టేట్‌లోని పలు ప్రాంతాలు కాలక్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కలిశాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో మాత్రం కొంతమంది విలీనమని, కొందరు విమోచనమని, మరికొందరు విద్రోహమని, అధికార పార్టీ నేతలు ప్రజాపాలన దినోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 17 తెలంగాణకు అసలు సిసలైన స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈనాటి విద్యార్థులకు రాష్ట్రంలోని విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు, తల్లిదండ్రులు, స్వాతంత్య్ర సమరయోధులు సెప్టెంబర్ 17 గురించి సరైన విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెప్టెంబర్ 17 గురించి గందరగోళానికి, అయోమయానికి తావు లేకుండా చూడాలి. రేపటి తరానికి సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పక తప్పదు.
డా.ఎస్ విజయ భాస్కర్, 9290826988