calender_icon.png 10 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైబ్రేరియన్ పోస్టులు భర్తీచేయాలి!

07-02-2026 12:00:00 AM

విజ్ఞానానికి చిరునామాగా నిలుస్తాయి గ్రంథాలయాలు. అటువంటి గ్రంథాలయ వ్యవస్థ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దయనీయ స్థితిలో ఉంది. గ్రంథాలయాల్లో వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చదివేందుకు విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ, ఆ పుస్తకానికి, విద్యార్థికి మధ్య వారధిగా నిలవాల్సిన లైబ్రేరియన్లు మాత్రం కరువయ్యారు. ప్రభు త్వ పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 25,519 పాఠశాలల్లో గ్రంథాలయ వసతులు ఉన్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క లైబ్రేరియన్ పోస్టు కూడా భర్తీ కాకపోవడం విద్యా వ్యవస్థలోని అతిపెద్ద వైఫల్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.

అక్కడ లైబ్రరీకి ప్రత్యేక పీరియడ్లను కేటాయిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలు చదువుకునే జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మాత్రం గ్రంథాలయాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లకు వ్యసనమవడమే గాక ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను సన్మార్గంలో పెట్టే శక్తి ఒక్క పుస్తకానికే ఉంటుంది. గ్రంథాలయాలకు వచ్చే ఒక విద్యార్ధి ఏ పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది అని చెప్పడానికి లైబ్రేరియన్ అవసరం ఉంటుంది. అందుకే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీ, కేరళ రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోని లైబ్రరీలను బలోపేతం చేయడమేగాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో గ్రంథాలయాల విలువలపై విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. మన రాష్ర్టం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

కమలేశ్వర్, ఇబ్రహీంపట్నం