25 June, 2026 | 2:04 AM

విద్య, వైద్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

25-06-2026 01:07 AM

ఎమ్మెల్యే కాలే యాదయ్య

మొయినాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): విద్య, వైద్యం రంగాల అభివృద్ధితోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని అమ్లాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు నూతనంగా నిర్మించిన ప్రహారీ గోడను ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.

గ్రామ సర్పంచ్ మద్యపాక కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన గ్రామంలో నిర్మించిన పలు సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను కూడా ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ నిధులతో సుమారు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.

గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మాడి రాజేందర్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి హిమబిందు, అమ్లాపూర్ సర్పంచ్ మద్యపాక కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు విక్రమ్ రెడ్డి, గీత, వనజాక్షి, లక్ష్మి వెంకట్ రెడ్డి, మండల విశ్వకర్మ గౌరవ అధ్యక్షులు వడ్ల నర్సింహాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేణుక అరుణ్కుమార్ గౌడ్, అశోక్ యాదవ్, మన్నె ప్రభాకర్ రెడ్డి, రక్తమైసమ్మ దేవాలయ చైర్మన్ గుంటం నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ జితేందర్ రెడ్డి, మాడి విక్రమ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లేష్, సామ కృష్ణారెడ్డి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.