calender_icon.png 9 February, 2026 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తిదాయకం!

07-02-2026 12:00:00 AM

దశాబ్ద కాలంలో మహిళల క్రికెట్ ఎంతో పరిణితి సాధించిందనడంలో సందేహం లేదు. కొన్నేళ్ల వరకు మ్యాచ్‌లో విజయం సాధిస్తే చాలు అనుకొన్న మన మహిళల జట్టు ఇవాళ క్రికెట్‌లో అద్భుతా లు సృష్టిస్తున్నది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నది. తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ పీఎల్) 4వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్బీబీ) వరుసగా రెండోసారి చాంపియన్స్‌గా నిలిచింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నది.

ఈ విజయం వ్యక్తిగతంగా ఆర్సీబీకి, ఆ జట్టు ఆటగాళ్లకు సంతోషాన్ని ఇచ్చింది. కానీ దేశంలో మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ అవసరమన్నది డబ్ల్యూపీఎల్ ద్వారా మరోసారి స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ సీజన్ లో ఎక్కువగా భారత జట్టుకు ఆడుతున్నవారే మెరిశారే తప్ప కొత్త వాళ్లు వెలుగులోకి రాలేదు. మంధాన, జెమీమా, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, షెఫాలీ.. వీరంతా ప్రస్తుత జట్టులో కీలక ఆటగాళ్లు.  తెలుగు క్రికెటర్ శ్రీచరణి తన ఆటతీరుతో జాతీయ జట్టులో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. కొత్తవారిలో గౌతమి నాయక్ ప్రభావం చూపించింది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఉన్న గౌతమి నాయక్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.

గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 73 పరుగులు సునామీ ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె మినహా భారత అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్ల నుంచి పెద్దగా మెరుపులు కనిపించలేదు. అయితే ఇప్పుడున్న భారత మహిళల జట్టు శాశ్వతం కాదు. వయసు మీదపడిన ఆటగాళ్లు ఏదో ఒక సమయంలో వీడ్కోలు పలకాల్సిందే. కాబట్టి జట్టులోకి కొత్త నీరు రావాల్సిన అవసరముంది. ఇక వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం డబ్ల్యూపీఎల్‌లో కొత్త జట్టుగా రానుంది.

దీంతో దేశంలో మహిళా క్రికెటర్లకు మంచి అవకాశంగా భావించొచ్చు.  అయితే పురుషులతో పోలిస్తే మహిళా క్రికెట్‌కు ఇప్పటికీ సమాన ఆదరణ దక్కడం లేదనే చెప్పొచ్చు. గతేడాది భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ మన అమ్మాయిల జట్టు విశ్వవిజేతగా అవతరించింది. కానీ 2024లో పురుషుల టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు స్వదేశీ గడ్డపై ఘనమైన స్వాగతం లభించింది. అంతేకాదు ముంబై వీధుల్లో అశేష జనవాహిని మధ్య ఓపెన్ టాప్ బస్సుల్లో ప్రపంచకప్ టైటిల్‌తో రోహిత్ సేన విక్టరీ పరేడ్‌ను ఘనంగా నిర్వహించింది.

ఆ తర్వాత ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని ఆటగాళ్లకు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. కానీ గతేడాది ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టుకు మాత్రం కేవలం అభినందనలే తప్ప ఎలాంటి సన్మానాలు, సత్కారాలు జరగలేదు. విక్టరీ పరేడ్ అనే మాట వినిపించలేదు. అయితే బీసీసీఐ వ్యక్తిగతంగా ఆటగాళ్లను పిలిచి సన్మాన కార్యక్రమం నిర్వహించడం కాస్త ఊరట కలిగించే అంశం. ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉన్న మహిళల క్రికెట్ ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ ఇంకా పురుషుల క్రికెట్‌తో సమాన హోదా దక్కడం లేదన్నదే చిన్న వెలితిగా ఉంది. ఈ ఏడాది జూన్‌లో మహిళల టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మన అమ్మాయిలు వన్డే ప్రపంచకప్ విజయాన్ని రిపీట్ చేస్తారని ఆశిద్దాం.