12 August, 2026 | 7:06 PM

గ్రామీణ యువత ఉన్నతికి గ్రంథాలయాలే వారధులు

12-08-2026 04:50 PM

- కలెక్టర్ రాజర్షి షా

- కొల్హారి గ్రామంలో నూతన గ్రంథాలయం ప్రారంభం

గుడిహత్నూర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యాలను సాధించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని బుధవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్, దినపత్రికలు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ పుస్తక పఠనానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆలోచనా శక్తిని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగార్థులు పోటీ పరీక్షల పుస్తకాల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే అన్ని సౌకర్యాలు కల్పించడమే ఈ గ్రంథాలయ లక్ష్యమని తెలిపారు.

వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన గైడ్లు, రిఫరెన్స్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. యువత ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి తమ కుటుంబంతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ సర్పంచ్, కార్యదర్శి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.