12 August, 2026 | 8:18 PM

మరుగుదొడ్డిలో శిశువు మృతదేహం

12-08-2026 06:29 PM

* ఆలస్యంగా వెలుగులోకి ఘటన

* సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు!

* మరుగుదొడ్డిలో లభించిన శిశువు మృతదేహం.. 

* మార్చురీ ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లు సమాచారం

* డ్యూటీ డాక్టర్ అనుదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు

ఆసుపత్రి సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణకు డిమాండ్

సదాశివపేట: సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో శిశువు మృతదేహం లభించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రి మరుగుదొడ్డిలో శిశువు మృతదేహం కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లు సమాచారం. ఈ ఘటనపై డ్యూటీ డాక్టర్ అనుదీప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే శిశువు మృతదేహం ఆసుపత్రి మరుగుదొడ్డిలోకి ఎలా వచ్చింది? ఎవరు అక్కడికి తీసుకొచ్చారు? మృతదేహాన్ని గుర్తించే వరకు ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణ ఏమైంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.

సిబ్బంది ప్రమేయంపై బలమైన అనుమానాలు

శిశువు మృతదేహం ఆసుపత్రి ప్రాంగణంలోనే లభించడం, అనంతరం దాన్ని మార్చురీలో భద్రపరచడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేసే కొందరు సిబ్బంది ప్రమేయం ఉండొచ్చనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలు వాస్తవమా? లేక మరేదైనా కారణమా? అనేది పోలీసుల సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రి ప్రసవ రికార్డులు, శిశువుల వివరాలు, డ్యూటీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీ తదితరాలను పరిశీలిస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది.

ఆసుపత్రి యాజమాన్యం సమాధానం చెప్పాల్సిందే!

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో భద్రతా పర్యవేక్షణ ఎలా ఉంది? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? శిశువు మృతదేహాన్ని గుర్తించిన తర్వాత అనుసరించాల్సిన నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలకు ఆసుపత్రి అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అదే సమయంలో నిర్దోషులపై అనుమానాలు రాకుండా వాస్తవాలను ఆధారాలతో వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. శిశువు మృతదేహం ఆసుపత్రి మరుగుదొడ్డిలోకి ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారు? ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తే సమాధానం చెప్పాల్సి ఉంది.