సాంకేతికతలను అవలంబించి, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలి
- మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్
- నానో ఎరువుల వినియోగంపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన
దండేపల్లి,(విజయక్రాంతి): రైతులు మూస పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అవలంబించి, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి (MAO) అంజిత్ కుమార్ సూచించారు. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ATMA ఆధ్వర్యంలో నానో ఎరువుల వినియోగ సాంకేతికతపై నిర్వహించిన క్షేత్ర ప్రదర్శనలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడారు. నానో ఎరువులను పంట అవసరాలకు అనుగుణంగా, శాస్త్రీయ పద్ధతిలో, ఉత్పత్తి లేబుల్‌పై సూచించిన మోతాదులో ఉపయోగించాలని రైతులకు సూచించారు. నానో ఎరువులు సాధారణ ఎరువులకు పూర్తిగా ప్రత్యామ్నాయం కాదని, సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
రైతుల సమక్షంలో ప్రత్యక్ష ప్రదర్శన
ప్రదర్శనలో రైతులకు నానో ఎరువులు ఇలా ఉపయోగించాలో ప్రాక్టికల్ గా రైతులకు చూపించారు. నానో ఎరువుల బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను చదవడం, సిఫార్సు చేసిన మోతాదును కొలవడం, నీటిలో కలపడం, స్ప్రేయర్‌ను సరిగ్గా కెలిబ్రేట్ చేయడం, పంట ఆకులపై సమానంగా పిచికారీ చేయడం వంటి అంశాలను ప్రత్యక్షంగా వివరించారు.
పిచికారీ విధానంపై ప్రత్యేక అవగాహన
పంట ఆకుల పైభాగంతో పాటు పంట ఆకుల లోపలి భాగానికి కూడా ద్రావణం సమానంగా చేరేలా సరైన నాజిల్, స్ప్రే కోణం, స్ప్రే వేగం పాటించాలని రైతులకు సూచించారు. ఆకులపై ద్రావణం కారిపోయేంత అధికంగా కాకుండా, సమానమైన కవరేజ్ వచ్చేలా పిచికారీ చేయాలని వివరించారు. అలాగే తీవ్రమైన ఎండ, అధిక గాలులు లేదా వర్షం వచ్చే సమయంలో పిచికారీ చేయకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల్లో స్ప్రే చేయాలని సూచించారు.
పత్తి, వరి పంటల్లో వినియోగంపై అవగాహన
పత్తిలో vegetative growth, flowering, boll development దశల్లో పంట పోషక యాజమాన్యంపై రైతులకు ఏవో రంజిత్ కుమార్ వివరించారు. వరి పంటలో tillering, panicle initiation తదితర కీలక దశల్లో పంట పోషక అవసరాలను గుర్తించి తగిన విధంగా పోషకాలను అందించాలని సూచించారు. నానో యూరియా లేదా నానో DAPను మ్యాజిక్ ఎరువుగా భావించకుండా, నేల పరీక్ష, పంట అవసరం, సిఫార్సు చేసిన సమగ్ర ఎరువుల యాజమాన్యంతో కలిపి ఉపయోగించాలన్నారు.
నానో ఎరువులను ప్రతి పురుగుమందు లేదా ఇతర రసాయనాలతో ఇష్టానుసారం కలపకూడదని, సంబంధిత ఉత్పత్తి లేబుల్ సూచనలు, compatibility ఆధారంగా మాత్రమే మిశ్రమాలను ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు పంటల్లో నానో ఎరువుల వినియోగంపై తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో IFFCO ప్రతినిధి అచ్యుత్, PACS CEO మల్లేష్, గూడెం గ్రామ AEO శ్రావణ్, వెల్గనూర్ గ్రామ AEO సాయి, ఇతర వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






