విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కార్యక్రమం
బోధన్,(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు “న్యాయం పొందే అవకాశం – ఉచిత న్యాయ సహాయం” అంశంపై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బోధన్ మండల న్యాయ సేవల కమిటీ చైర్‌పర్సన్, 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి డి. వరూధిని తెలిపారు. బోధన్ మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ ఉదయం 9 గంటలకు బోధన్ రాకాసిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం పొందే హక్కు, ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్న విధానం, న్యాయ సేవల ప్రాధాన్యత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన వారు, న్యాయ సహాయం అవసరమైన అర్హులైన వ్యక్తులు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు న్యాయపరమైన హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బోధన్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్యానెల్ అడ్వకేట్లు, పారా లీగల్ వాలంటీర్లు (PLVs) తదితరులు పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత న్యాయ అధికారులు, న్యాయవాదులు, సిబ్బందికి మండల న్యాయ సేవల కమిటీ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.






