రౌడీషీటర్‌కు జీవిత ఖైదు
మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్కు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేసముద్రం సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2020 ఆగస్టు నెల 23న అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు.
కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారతో వెంకన్న పై దాడికి పాల్పడి అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్ఐ బీ. సతీష్, వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం, పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్షీట్ను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు.
తదుపరి ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ లు క్రాంతి కిరణ్, నరేష్ కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు. కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు 30 వేల రూపాయల జరిమానా విధించింది..
ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హర్పీ అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం, మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.




