21 June, 2026 | 7:01 PM

భాషాపండితుల పదోన్నతులకు లైన్‌క్లియర్!

15-06-2024 01:14 AM

ఎస్జీటీల కేసును డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు

హర్షం వ్యక్తం చేసిన ఆర్‌యూపీపీటీఎస్, ఆర్‌యూపీపీటీ సంఘాలు

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): గత కొన్నేండ్లుగా పదోన్నతి లేకుండా ఉన్న భాషాపండితులకు సుప్రీంతీర్పు ఊరట కల్గించింది. పదోన్నతుల్లో భాషాపండితులతోపాటు కలిపి ఉమ్మడిగా ఇవ్వాలని ఎస్జీ టీలు వేసిన కేసును శుక్రవారం సుప్రీం డిస్మి స్ చేసింది. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు ఇప్పటికే ప్రభుత్వం జారీచేసిన షెడ్యూల్‌కు ఇక ఎటువంటి ఆటంకం లేకపోవడంతో ఆ ప్రక్రియ సాఫీగా కొనసాగనుంది. స్కూల్ అసిస్టెంట్ భాషల పోస్టుల్లో భాషా పండితులకే అవకాశం కల్పిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక జీఓలను ఇచ్చింది.

అవన్నీ న్యాయపరమైన చిక్కులతో సంపూర్ణంగా లేకపోడంతో హైకోర్టు సూచనతో గతంలో జీవోలను జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఎస్జీటీ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా అక్కడి డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా వారి కేసును కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఎస్జీటీలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారించిన కోర్టు కేసును కొట్టివేసింది. దీంతో భాషాపండితులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి మార్గం సుగమమైంది. 

20 ఏళ్ల కలసాకారం: జగదీశ్, ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షుడు

20 ఏళ్ల కల సాకారమైందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు  రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా భాషాపండితులకు రావాలసిన న్యాయమైన పదోన్నతులను రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆ కేసును డిస్మిస్ చేయడంతో రాష్ట్రంలోని వేలాది మంది పండితులు, పీఈటీలు హర్హం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి ధన్యవాదాలు: గుళ్లపల్లి తిరుమల కాంతి కృష్ణ ఆర్‌యూపీపీటీ

ఎస్జీటీల కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షించదగ్గ విషయమని ఆర్‌యూపీపీటీ ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ తెలిపారు. ఈ విజయం ప్రభుత్వం, భాషా పండితులందరిదన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని, విద్యాశాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.