21 June, 2026 | 8:18 PM

రాజీకి లంచం ఇవ్వాలి

15-06-2024 01:13 AM
  1. సీసీఎస్ ఏసీపీ విచారణతో వెలుగులోకి వస్తున్న సీఐ సుధాకర్ ఆగడాలు
  2. ఇప్పటికే బాధితుడి నుంచి రూ.5 లక్షలు వసూలు
  3. మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమపై నమోదైన కేసులో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకొని కేసును ఉపసంహరించుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ను కలిశారు. కానీ, మొద టగా ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం తనకు లంచం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో సీసీఎస్‌లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రామ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణకు పిలిచారు.

ఈ క్రమంలో ఏసీపీ రామ్‌రెడ్డిని వివిధ కోణాల్లో విచారించిన ఏసీబీ అధికారులు పలుఆసక్తికర విషయాలను వెల్లడించి నట్టు సమాచారం. కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆయననూ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. ఓ కేసు విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా జూన్ 13న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బోయిన్‌పల్లికి చెందిన శ్రీమణి రంగస్వామిపై సీసీఎస్‌లో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన వారు రాజీ కుదుర్చుకుని కేసును విత్‌డ్రా చేసుకునేందుకు ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ని కలిశారు.

కేసు విత్‌డ్రా చేసుకోవాలంటే కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌టీం 7లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ చామకూరి సుధాకర్ స్పష్టం చేశారు. అలాగే ఈ కేసును సీసీఎస్‌లో క్లోజ్ చేసేందుకు తనకు మిగతా రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలి విడతగా రూ.5 లక్షలు బాధితుడి నుంచి తీసుకున్నాడు. రెండో విడతగా జూన్ 13న రూ. 3 లక్షలు తీసకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. లంచం కేసులో అరెస్టున ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ను నేడు అధికారులు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.