21 June, 2026 | 5:58 PM

కొత్త పింఛన్లు ఏవి?

15-06-2024 01:15 AM

ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు ఇచ్చారు

తెలంగాణలో 6 నెలలైనా పింఛన్ల పెంపు హామీగానే ఉండిపోయింది 

ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతున్నా హామీల ఊసేత్తడం లేదని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ర్ట ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో శుక్రవారం మాట్లాడారు. హామీల అమలు డిసెంబర్ 9న అని, తర్వాత 100 రోజుల గడువు తీసుకున్నారని ఇప్పుడు ఆర్నెల్లు అయినా స్పందించడం లేదని విమర్శించారు. హామీలు అమలుకు నోచుకుంటా యనే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వృ ద్ధ్దులు, వితంతువులు, దివ్యాంగులు పింఛ న్ పెంపు హామీని కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని ఆరోపించా రు.

పక్క రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఆర్థిక సమస్యలు, అప్పులు ఉన్నప్పటికీ ఇచ్చిన పింఛన్ హామీ అమలుకు తొలి సంతకం చేసి ముందడుగు వేసిందన్నారు. ఏపీ సర్కారు ను చూసైనా రేవంత్ పింఛన్ పెంపు హామీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలుపుకుని (6 నెలలు) పెరిగిన పింఛన్లను ఇవ్వాలన్నారు. ఈ నెల 12న విద్యార్థులకు పంపిణీ చేసిన తెలుగు వాచకం ముందుమాటలో గత ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి పేర్లు ఉండటంతో దాదాపు 20 లక్షల పుస్తకాలను ప్రభుత్వం వాపస్ తీసుకోవడం సరికాదన్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రీప్రింట్ కోసం సర్కార్ ఖజానాపై భారం వేయవద్దని అన్నారు. ఆ  పుస్తకాల్లో ముందు మాటలో జాతీయ గీతం, ప్రతిజ్ఞ ఉన్న పేజీలను చించేయ డం అంటే దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని తెలిపారు. ఏపీ సర్కారు తీరును ఈ సందర్భంలో ఏలేటీ ఉదహరించారు. ఏపీలో గత సీఎం ఫొటోతో ఉన్న పుస్తకాలనే పంపిణీ చేసిందని గుర్తు చేశారు. 

అధ్యక్షుడిని నిర్ణయించేది అధిష్ఠానమే

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి నియామకం అధిష్ఠానం పరిధిలోని అంశమని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచే స్తామన్నారు. రాష్ట్రంలో ఈడీ దర్యాప్తు అం శంపై స్పందిస్తూ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు తమ పని తాము చేస్తాయని తెలిపారు. ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశా వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను 18 వేలకు పెంచి, ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని కోరారు. గతంలో ఆశాలు ధర్నా చేసినప్పుడు ఇచ్చిన హామీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన ఉద్యోగ భరోసాను మరచిపోవద్దన్నారు.