1.83 కోట్ల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
మణికొండ, జూన్ 15: వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన రూ.1.83 కోట్ల విలువైన 10,222 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. శనివారం రాజేంద్రనగర్‌లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ సమక్షంలో రోడ్డు రోలర్‌తో మద్యం బాటిళ్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవా తదితర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించకుండా కొందరు ప్రయాణికులు విమానంలో మద్యం తీసుకొస్తుండగా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఆర్‌జీఐఏ విమానాశ్రయంలో పట్టుకున్నట్లు తెలిపారు. కొందరు విదేశాల నుంచి కూడా ఖరీదైన మద్యాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ దేవేందర్ రావు పాల్గొన్నారు.






