18 August, 2026 | 12:25 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

ఆగస్టు నుంచి అదనపు హైక్

16-06-2024 02:40 AM

భూముల మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తు

  1. ప్రతిపాదనలు కోరుతూ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
  2. ఆగస్టు 1 నుంచి అమలులోకి కొత్త ఛార్జీలు
  3. ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 100 శాతం పెరిగే చాన్స్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (విజయక్రాంతి): స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలపై ఆగస్టు నుంచి అదనపు భారం పడనున్నది. భూముల విలువలతో పాటు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలనూ ప్రభుత్వం పెంచనున్నది. దీనిలో భాగంగా మండల, జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లతో పాటు సంబంధిత యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. 

వీరు రెండు రోజుల్లో సర్కార్‌కు నివేదికలు పంపించాల్సి ఉన్నది. అన్ని రకాల కసరత్తులు, సమీక్షలు, చర్చల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఆగస్టు 1 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనున్నది. దీనికి సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ అన్ని జిల్లాల డీఐజీలు, డీఆర్‌లు, సబ్ రిజిస్ట్రార్‌లకు మెమో ఎంవీ/539/2014 ద్వారా ఈ నెల 14న మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు దీనికి సంబంధించిన కసరత్తును షురూ చేశారు.

 ఈనెల 18 లోపు ప్రతిపాదనలు..

సబ్ రిజిస్ట్రార్లు తమ ప్రాంతం పరిధిలో ప్రస్తుతం మార్కెట్ విలువలు, ప్రైవేటు ధరల ఆధారంగా ఈ విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. సబ్ రిజిస్ట్రార్లు ఇచ్చే మార్కెట్ విలువల నివేదికలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మరోసారి సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ నెల 18 లోపు అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని మార్కెట్ విలువలను సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు జరుగుతున్నది. మరోవైపు అన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వేయర్లు, మున్సిపల్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు మార్కెట్ విలువ పెంపుపై చర్చించనున్నారు.

ఇదే నెల 23న మార్కెట్ విలువలకు సంబంధించి రివిజన్‌పైనా చర్చలు జరుపనున్నారు. 25న సబ్ రిజిస్ట్రార్ల నివేదికలపై సీ అండ్ ఐజీతో రివ్యూ మీటింగ్, 29న మార్కెట్ విలువలపై అప్రూవల్ కమిటీ సమావేశం జరుగుతుంది. జూలై 1న యంత్రాంగం మార్కెట్ విలువలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఆపై ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించి స్వీకరిస్తుంది. జూలై 15లోపు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత జూలై 24న రీవైజ్ కమిటీ చివరగా మార్కెట్ విలువలకు ఆమోదం తెలుపనున్నది. అనంతరం ప్రభుత్వానికి కొత్త మార్కెట్ విలువలను ఆయా జిల్లా కలెక్టర్లు సమర్పించనున్నారు. జూలై 31న కొత్తగా ఆమోదం పొందిన మార్కెట్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వైబ్‌సైట్‌లోకి వస్తాయి. ఇక ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలులోకి రానున్నాయి.

 ప్రాంతలను బట్టి పెరుగనున్న మార్కెట్ విలువ..

ప్రాంతాలను బట్టి భూముల మార్కెట్ విలువ పెరగనున్నదని తెలుస్తున్నది. ముఖ్యంగా నేషనల్ హైవేలు, పారిశ్రామిక వాడలు, కమర్షియల్ జోన్‌లు, గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్రీయ రహదారులు ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాల మార్కెట్ విలువను అధికారులు నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ధర, ప్రైవేటు విలువలు, ఆయా గ్రామాలు, పట్టణాల్లోని గ్రామస్తులు, పట్టణవాసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ, మున్సిపల్ అధికారుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ఈ విలువలను నిర్ణయించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలో జోనల్ డెవలప్‌మెంట్, సంబంధిత అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ప్రణాళికలనూ పరిగణలోకి తీసుకోనున్నారు. మిగిలిన పట్టణ ప్రాంతాలు, సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మాస్టర్ ప్లాన్‌లను పరిగణలోకి తీసుకొని భూమి విలువ సంబంధించిన నిర్ణయం ఉంటుంది.

వ్యవసాయ భూముల విలువల పెంపులోనూ...

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువల పెంపుపైనా  ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఖజానా రాబడి పెంచుకునే మార్గాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, భూముల మార్కెట్ విలువలపై ఆరా తీసినట్లు తెలిసింది. కొందరు మంత్రులతోనూ ఇదే విషయంపై సుదీర్ఘ మంతనాలు చేసినట్లు సమాచారం. వాస్తవ ధరలు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అలాగే వ్యవసాయ భూముల విలువలనూ సర్కార్ పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ శివారులోని కొన్నిచోట్ల మార్కెట్ విలువ కన్నా, వాస్తవ ధర వందల రెట్లు అధికంగా ఉందని యంత్రాగం ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రస్తుతం ఏ మేరకు ఆదాయం సమకూరుతోంది.. భూముల విలువలు ఏ మేరకు పెంచాలి.. తద్వారా ప్రభుత్వానికి రాబడి ఎంత పెరుగుతుందనే అంశాలపై ప్రభుత్వం చర్చోపచర్చలు చేస్తున్నది. 2021 22లో నాటి ప్రభుత్వం సాగు, సాగుయేతర రంగాల్లో ఏ మేరకు మార్కెట్ విలువలు పెంచింది.. తద్వారా ఎంత రాబడిని అదనంగా సాధించిందనే అంశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 

రెట్టింపు ఆదాయం..

గత ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయ, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని, ఛార్జీల పెంపును నిర్ణయించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పెంపు ప్రాంతాన్ని బట్టి సుమారు 50 నుంచి 100 శాతం మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భూమి స్వభావాన్ని బట్టి భూములకు వేర్వేరుగా ఛార్జీలు ప్రతిపాదించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజునూ కొంత పెంచే అవకాశం ఉందని సమాచారం. వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరా కనీస ధర ప్రస్తుతం రూ.75 వేలు ఉండగా,  ధర కూడా మారుతుందని తెలుస్తున్నది. ధరలు భారీగా ఉన్న చోట ఛార్జీ ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం 50 నుంచి 100శాతం వరకు భూముల మార్కెట్ విలువలను ప్రకటిస్తే, ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రెట్టింపు ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడుతున్నాయి.