10 June, 2026 | 1:15 AM

చర్లను కమ్మేస్తున్న మద్యం మాఫియా!

10-06-2026 12:00 AM
  1. చర్ల మండలాన్ని కమ్మేస్తున్న మద్యం మాఫియా కోరలు 
  2. బడి, గుడి ఎదుటే బెల్ట్ షాపులు 
  3. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ? 
  4. ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి కాదు, వారి కనుసన్నల్లోనే అక్రమ దందా 
  5. ‘మా బతుకులు బుగ్గిపాలు చేస్తున్నారు’ అంటూ మహిళల గుండెకోత

చర్ల, జూన్ 8 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మద్యం మాఫియా చేతుల్లో బందీ అయింది. గల్లీకో బెల్ట్ షాపు వెలిసి బడి, గుడి అనే విచక్షణ లేకుండా మద్యం ఏరులై పారుతోంది. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. 

ఎమ్మార్పీ కంటే రూ.60 అదనం:

మండలంలోని ప్రతి గ్రామంలో 3 నుంచి 5 బెల్ట్ షాపులు నిరాటంకంగా నడుస్తున్నాయి. ఒక్కో బాట్పి ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. తాగుబోతుల బలహీనతే మాఫియాకు కాసులు కురిపిస్తోంది. రోజు కూలీ చేసుకునే వ్యక్తి సంపాదనంతా మద్యానికే ఖర్చవడంతో ఇళ్లల్లో గొడవలు సర్వసాధారణమయ్యాయి. 

వైన్‌షాపుల్లో కృత్రిమ కొరత:

ఇదంతా పథకం ప్రకారమే జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైన్ షాపుల్లో నాణ్యమైన బ్రాండ్లు దొరకకుండా చేసి, జనాన్ని బెల్ట్ షాపుల వైపు మళ్లిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కావాల్సిన బ్రాండ్ అడిగితే స్టాక్ లేదంటారు. కానీ అదే బ్రాండ్ పక్కనే ఉన్న బెల్ట్ షాపులో డబుల్ రేటుకు దొరుకుతుంది అని ఓ వినియోగదారుడు వాపోయాడు. 

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ?:

అక్రమ బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నెలవారీ మామూళ్ల వల్లే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. దాడులు చేయాల్సిన శాఖే మాఫియాకు కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

లూజ్ మద్యంతో ప్రాణాలకు ముప్పు:

కొన్ని బెల్ట్ షాపుల్లో లూజ్ మద్యం కూడా విక్రయిస్తున్నారు. నాణ్యత లేని ఈ మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. కిడ్నీ, లివర్ సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. 

మహిళల కన్నీటి వ్యథ:

మద్యం అందుబాటు పెరగడంతో గ్రామాల్లో గొడవలు, కుటుంబ కలహాలు విపరీతమయ్యాయి. చిన్నపిల్లలు సైతం మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మగవాళ్లు తాగొచ్చి రోజూ కొడుతున్నారు. పిల్లల చదువులు పాడైపోయాయి. మద్యం మా ఇళ్లలో శాంతిని నాశనం చేసింది. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. 

ప్రజల ప్రధాన డిమాండ్లు:

* మండలంలోని అక్రమ బెల్ట్ షాపులన్నింటినీ తక్షణమే మూసివేయాలి.  

* వైన్ షాపుల్లో అన్ని బ్రాండ్ల మద్యం ఎమ్మార్పీ ధరకే లభించేలా చర్యలు తీసుకోవాలి.  

* మద్యం మాఫియాకు సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.  

* లూజ్ మద్యం విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.  

* ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి చర్ల మండలంలో పాతుకుపోయిన మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాలని  కోరుతున్నారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.