27 July, 2026 | 9:52 PM

శిలాఫలకానికే పరిమితమైన డ్రైనేజీ పనులు

27-07-2026 09:19 PM

* ఏడాది దాటినా ప్రారంభం కాని రూ.3 లక్షల పనులు

*  మురుగునీటితో కాలనీవాసుల అవస్థలు

* తక్షణమే పనులు చేపట్టాలని మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ ఎడ్ల నర్సింహగౌడ్‌ డిమాండ్‌

అచ్చంపేట: శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా డ్రైనేజీ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో నెలకొన్న ఈ పరిస్థితిపై మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల నర్సింహగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మాజీ కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్ పటేల్‌, రమేష్‌రావుతో కలిసి ఐదో వార్డులో పర్యటించిన ఆయన కాలనీవాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలుస్తోందని, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని వారి దృష్టికి తీసుకువచ్చారు. ఎడ్ల నర్సింహగౌడ్‌ మాట్లాడుతూ 2025 జూన్‌ 3న రూ.3 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినప్పటికీ, ఏడాది దాటినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. శిలాఫలకం ఏర్పాటు చేయడానికే పరిమితమై పనులను గాలికొదిలేశారని విమర్శించారు.

పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, అధికార కాంగ్రెస్‌ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మురుగునీటి సమస్య తీవ్రతరం కాకముందే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.