3 July, 2026 | 11:14 AM

కప్పు కహానీ..

28-05-2024 01:36 AM

1260 సిక్సర్లు.. 2174 ఫోర్లు

41 సార్లు రెండొందల పైచిలుకు స్కోర్లు..

8 సార్లు 250+పరుగులు 

ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యధిక స్కోరు.. 

టీ20ల్లో అత్యధిక పరుగుల ఛేదన..

ఒకటా రెండా.. ఐపీఎల్ 17వ సీజన్‌లో నమోదైన రికార్డులు రాస్తే రామాయాణం.. చెబితే మహాభారతమే! మరి మండు వేసవిలో నిండు వినోదాన్ని పంచిన ఈ ఏడాది లీగ్ ముగియగా.. వచ్చే సారి మెగా వేలం జరగనున్న నేపథ్యంలో జట్ల స్వరూపాలు మారడం దాదాపు ఖాయమే! పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మరోసారి ఐపీఎల్ ఘనతలను మననం చేసుకుంటే..

రెండు నెలల పాటు క్రీడాభిమానులను మంత్రముగ్దులను చేసిన ఐపీఎల్ సీజన్ ఘనంగా ముగిసింది. సీజన్ ఆసాంతం నిలకడ కనబర్చి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టే ట్రోఫీ కొల్లగొట్టింది. టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు జరిగిన ఈ లీగ్ వల్ల భారత ఆటగాళ్లకు కొంత మోదం, కోంత ఖేదం ఎదురైంది. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా భారాన్ని మోసే విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అదరగొడితే.. అదే సమయంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, మహమ్మద్ సిరాజ్ వంటి వాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరో నాలుగు రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. ఐపీఎల్లో నమోదైన రికార్డులు, రివార్డులను మరోసారి సింహావలోకనం చేసుకుంటే.. 

అరాచకానికి అర్థం మార్చి!

ఐపీఎల్ అంటేనే పరుగుల వినోదం అని ముద్రపడ్డా.. ఈ సారి అంతకుమించిన విధ్వంసం సాగింది. టాపార్డర్, లోయరార్డర్.. పెద్ద జట్టు, చిన్న జట్టు అనే తేడా లేకుండా  బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ బాదుడే పరమావధిగా సాగిపోయారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలయ్యాయి. మొత్తం లీగ్‌లో నమోదైన తొమ్మిది అత్యధిక స్కోర్లలో ఎనిమిది ఈ సీజన్‌లోనే వచ్చాయంటే ఈ ఏడాది పరుగుల వరద ఏ రేంజ్‌లో పారిందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే అత్యధిక స్కోరు..  పొట్టి ఫార్మాట్‌లోనే అత్యధిక పరుగుల ఛేదన.. టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు, ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు ఈసారి బద్దలయ్యాయి. నిరుడు ఐపీఎల్లో 1124 సిక్సర్లు నమోదైతేనే వామ్మో అనుకుంటే.. ఈ సారి ఆ సంఖ్య 1260కి చేరి అదుర్స్ అనిపించింది. నిరుడు ఓవరాల్‌గా 8.99 రన్‌రేట్ నమోదు కాగా.. అది ఈ ఏడాది 9.56కు చేరింది. కేవలం పూర్తున ఇన్నింగ్స్‌ల పరంగా చూసుకుంటే అది 11.4 కావడం మరో విశేషం.

పవర్ ప్లే

ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లు ఈ ఏడాది పవర్ ప్లేను సద్వినియోగం చేసుకున్నాయి. తొలి ఆరు ఓవర్ల ఫీల్డింగ్ నిబంధనలను వినియోగించుకుంటూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు వరసలో ఉందనడంలో సందేహం లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బౌలర్లను ఉతికి ఆరేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈక్రమంలో రైజర్స్ ఒకటికి రెండుసార్లు పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ కేవలం 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసి టీ20 క్రికెట్‌లోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు తమ పేరిట రాసుకుంది.

ఇక హైదరాబాద్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ విశ్వరూపం చూపింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి నభూతో అనిపించింది. ఈ సీజన్‌లో కోల్‌కతా విజేతగా నిలవడంలోనూ ఓపెనర్లే కీలక పాత్ర పోషించారు. సాల్ట్, నరైన్ జోడీ విధ్వంస రచన చేయడంతో నైట్‌రైడర్స్‌కు శుభారంభాలు దక్కాయి. ఇక ఢిల్లీ నయా ఓపెనర్ జేక్స్ ప్రెజర్ మెక్‌గర్క్ సృష్టించిన సునామీని ఎవరు మరచిపోగలరు.

గంభీర్ ఇంపాక్ట్

కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా గౌతమ్ గంభీర్ ప్రభావం చూపించాడా అంటే కచ్చితంగా అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. గత రెండేళ్లు లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ ఆ జట్టు రెండు సార్లు ప్లేఆఫ్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గంభీర్‌ను తిరిగి కోల్‌కతాకు మెంటార్‌గా నియమించడానికి ఆ జట్టు యాజమాన్యం బాగానే శ్రమించింది. గతేడాది కోహ్లీతో వివాదం అనంతరం లక్నో జట్టు గంభీర్‌ను తొలగించడం ఒకింత కోల్‌కతాకు కలిసివచ్చింది. గౌతీ కూడా కెప్టెన్‌గా రెండుసార్లు విజేతగా నిలిపిన కోల్‌కతాకు తిరిగి రావడాన్ని సొంతగూటికి చేరినట్లుగా ఫీలయ్యాడు.

యాజమాన్యం కూడా అతడికి మెంటార్‌గా పూర్తి స్వేచ్ఛనివ్వడంతో ఆటగాళ్లతో సమన్వయంగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాడు. వేలంలో మిచెల్ స్టార్క్‌ను భారీ రేటు పెట్టి కొనడం దగ్గరి నుంచి సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపించడం.. వెంకటేశ్ అయ్యర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా లాంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించడం దాకా అన్నింటా గంభీర్‌ది ముఖ్యపాత్ర. 2014 తర్వాత పదేళ్ల పాటు కోల్‌కతా టైటిల్ అందుకోలేదు. గత రెండు సీజన్లుగా 7వ స్థానానికే పరిమితమైంది. కానీ గంభీర్ మెంటార్‌గా ఎంట్రీ ఇచ్చిన సీజన్‌లోనే కోల్‌కతా చాంపియన్‌గా నిలవడంతో అతని ఇంపాక్ట్ బలంగా ఉందని స్పష్టమవుతోంది.

ఇటు కోహ్లీ, అటు బుమ్రా..

టీమిండియా ప్రధాన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తాజా సీజన్‌లో సత్తాచాటారు. టీ20 ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక జరగడానికి ముందు కోహ్లీ స్ట్రయిక్‌రేట్‌పై విపరీతమైన చర్చ జరగగా.. అతడు దానికి తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. మిగిలిన ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చోట విరాట్ కోహ్లీ సీజన్ ఆసాంతం నిలకడ కనబర్చాడు. అత్యధిక పరుగుల (741) వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ ఈ ఏడాది 154.69 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అది గతం (152.03) కంటే ఎక్కువ కావడం విశేషం. మరోవైపు ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో దుమ్మురేపాడు. ముంబై జట్టు వరుస పరాజయాలతో సతమతమైనా.. బుమ్రా మాత్రం నిరాశ పరచలేదు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 16.80 సగటుతో 20 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా 6.48 ఎకానమీతో కావడం గమనార్హం.

ఇంపాక్ట్ చూపారు

ఆటలో వినోదాన్ని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన ఇంపాక్ట్ నిబంధనను ఈ సీజన్‌లో అన్నీ జట్లు సమర్థంగా వినియోగించుకున్నాయి. అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో టాపార్డర్ మరింత స్వేచ్ఛగా ఆడటంతోనే ఈ సీజన్‌లో లెక్కకు మిక్కిలి రికార్డులు నమోదయ్యాయి. ఓవరాల్‌గా సీజన్‌లో 41 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదవగా.. హైదరాబాద్, బెంగళూరు మద్య జరిగిన పోరులో 40 ఓవర్లలో కలిపి 549 పరుగులు వచ్చాయి. ఓవారల్‌గా సీజన్‌లో 14 సెంచరీలు నమోదుకాగా.. అర్ధశతకాలకైతే లెక్కేలేదు. ‘ఎక్స్‌ట్రా బ్యాటర్ ఉన్నాడని తెలుసు కాబట్టే పవర్‌ప్లేలో మరింత ధాటిగా ఆడుతున్నా. ఎనిమిదో స్థానంలో కూడా ఆడగలిగే ప్లేయర్ ఉన్నప్పుడు ముందు వరస వారికి స్వేచ్ఛ లభించినట్లే’ అని విరాట్ కోహ్లీ అన్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఆటలో దూకుడు పెంచేందుకు తెచ్చిన ఈ నిబంధన కారణంగా బంతికి, బ్యాట్‌కు మధ్య సమతూల్యత దెబ్బతిన్నదనేది మాత్రం వాస్తవం. ఈ ఏడాది ఇన్ని రికార్డులు బద్దలయ్యేందుకు ప్రధాన కారణాల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కూడా ఒకటి. హెడ్, రోహిత్ శర్మ, శివమ్ దూబే వంటి పలువురు ఆటగాళ్లు ఈ ఏడాది ఇంపాక్ట్‌గా బరిలోకి దిగి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇది ఇలాగే సాగితే.. ‘కాకా.. వచ్చే సీజన్‌లో నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగు. ఇకపై ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ క్రీజులోకి వెళ్లి దుమ్మురేపి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో’ అని గేల్‌ను ఉద్దేశించి.. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు నిజమైనట్లే. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కేవలం పరీక్షించడం కోసమే తీసుకొచ్చామని చెప్తున్న బీసీసీఐ కార్యదర్శి జై షా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

నరైన్ ఆల్‌రౌండర్

ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌పై వెస్టిండీస్ ప్లేయర్ల ప్రభావం మామూలుది కాదు. ఏ జట్టును తీసుకున్నా అందులో ఒకరిద్దరు ప్రధాన ప్లేయర్లు కరీబియన్లే ఉండటం పరిపాటే. అయితే ఈ సారి కోల్‌కతా విజయాల్లో నరైన్, రస్సెల్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్న నరైన్.. ఓపెనర్‌గా బరిలోకి దిగి 488 పరుగులు చేయడంతో పాటు.. బంతితో 17 వికెట్లు తీసి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ దెబ్బతో వరల్డ్‌కప్ బరిలోకి దిగే జట్టులో నరైన్ ఆడాలనే వాదన వారి దేశంలో పెరిగిపోయింది. తొలి బంతి నుంచే ఊచకోత కోసే నరైన్ ఈ సీజన్‌లో తొలిసారి సెంచరీ కూడా నమోదు చేసుకోవడం మరో విశేషం.

సిక్స్‌ర్లే సిక్సర్లు

మామూలుగా పొట్టి ఫార్మాట్ అంటేనే బాదుడు. అందులో ఐపీఎల్ అంటే ఇక చెప్పేదేముంది. పరుగుల వరద పారాల్సిందే. బంతి పడిందే తడువు దానిమీద ఆకలిగొన్న సింహాల్లా విజృంభించిన బ్యాటర్లు ఈ సీజన్‌లో కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 62.7 శాతం పరుగులు రాబట్టారు. 2023 ఐపీఎల్లో ఇది 60.1 శాతంగా ఉండగా.. ఈ సారి మరో రెండు శాతం పెరిగింది. బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో 62 ఫోర్లు, 38 సిక్సర్లతో దుమ్మురేపితే.. తానేం తక్కువా అన్నట్లు ట్రావిస్ హెడ్ 64 ఫోర్లు, 32 సిక్సర్లతో అదరగొట్టాడు. ఇక పిట్ట కొంచం కూత ఘనంలా చెలరేగిన అభిషేక్ శర్మ 42 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

పరాగ్ 2.0

రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. చాన్నాళ్లుగా జట్టుతో ఉన్నా.. ఈ సారి మాత్రం తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచే నిలకడ కొనసాగిస్తున్న పరాగ్.. మిడిలార్డర్‌లో 52.09 సగటుతో 573 పరుగులు రాబట్టాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిరుడు రాయల్స్‌కే చెందిన జైస్వాల్ సత్తాచాటితే.. ఈ సారి ఆ బాధ్యత పరాగ్ తీసుకున్నాడు.