3 July, 2026 | 12:18 PM

నయా కోచ్ గౌతమ్ గంభీర్!

28-05-2024 01:28 AM

చెన్నై: కోలకతా మూడో టైటిల్ ఖాతాలో వేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్‌ను.. టీమిండియా కోచ్‌గా నియమించాలనే డిమాండ్ రోజు రోజుకూ ఎక్కువవుతోంది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం గంభీర్‌తో బీసీసీఐ కార్యదర్శి  జై షా ముచ్చటించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. దీంతో బోర్డు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది.

దీనికి తుది గడువు సోమవారంతోనే ముగియడంతో.. గంభీర్ అయితేనే ఆ పదవికి న్యాయం చేయగలడనే వాదన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గంభీర్, జై షాల మధ్య కోచ్ అంశమై ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. గంభీర్ కూడా హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే తనను తప్పక ఎంపిక చేస్తారని హామీ ఇస్తే తప్ప గంభీర్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోబోననే వార్తలు వచ్చాయి. విదేశీ కోచ్‌ల కోసం ప్రయత్నించడం లేదని.. దేశవాళీ క్రికెట్‌పై పూర్తి అవగాహన ఉన్నవారికే అవకాశం ఇస్తామని జైషా అన్న మాటలు.. గంభీర్ ఎంపికకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

బాద్‌షా బ్లాంక్ చెక్!

ఇక కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కు ఆ జట్టు సహ యాజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం గంభీర్‌ను ప్రత్యేకంగా కలిసిన షారుక్ అతడిని హత్తుకున్నాడు. అనంతరం ఇద్దరు చాలా సేపు చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరో పదేళ్ల పాటు కోల్‌కతా జట్టుకు గంభీర్‌ను మెంటార్‌గా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం షారుక్ గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.