రుణానికో తీరు!
మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీ సింది. రూ.22,006 కోట్ల బకాయిల దావాలపై కేవలం రూ.6.5 కోట్ల చెల్లిస్తే సరిపోతుందనే పరిష్కారానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలపడం సంచలనంగా మారింది.
రుణ మొత్తంతో పోలిస్తే ఇది 0.03 శాతం మాత్రమే కావడం శోచనీయం. అయితే, ఈ రుణం మొత్తాన్ని సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకోలేదని, పలు సంస్థలకు హామీ ఇచ్చారని ఆయన కార్యాలయం వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సామాన్య ప్రజలు మాత్రం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తుండటం గమనార్హం. సామాన్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలను కొట్టిపారేయలేం. రుణం తీసుకున్నది కార్పొరేట్ సంస్థనా లేదా ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారా? అన్నది పక్కనపెడితే, దాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను విస్మరించడం సరికాదు.
పేద, మధ్యతరగతి కుటుంబాలు తీసుకున్న చిన్న చిన్న రుణాలకు సంబంధించి నెలనెలా వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తాయి. అవసరమైతే ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడరు. కానీ, వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాల విషయంలో ఈ తతంగమంతా ఎందుకు ఉండటం లేదని, భారీ మొత్తాన్ని తిరిగి పొందలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందన్నదే సామాన్యుడి ప్రశ్న. ఇలాంటి పరిష్కారాలు కార్పొరేట్ రుణాల రికవరీ విషయంలో బ్యాంకుల బాధ్యతను విస్మరించేలా చేసే ప్రమాదం లేకపోలేదు.
ఇప్పటికే బ్యాంకులు పెద్ద మొత్తంలో కార్పొరేట్ రుణాలను రైటాఫ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. వాస్తవానికి బ్యాంకులు చవిచూసే ఇలాంటి నష్టాల భారాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చివరికి ప్రజలే మోయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేటప్పుడు రుణగ్రహీతలు, పూచీకత్తు ఇచ్చేవారి ఆస్తులు, లావాదేవీలను బ్యాంకులు పర్యవేక్షిస్తున్నాయా? రుణం బకాయిగా మారిన తర్వాతే ఎందుకు చర్యలు చేప డుతున్నారు? వంటి సామాన్యుల ప్రశ్నలకు బ్యాంకర్లు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే సమయంలో సామాన్యుల రుణానికి కఠినమైన నిబంధనలు, కార్పొరేట్ రుణాలకు భారీ రాయితీలు అన్న భావన ఏర్పడితే, అది బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అంతిమంగా రుణ పరిష్కారం చట్టబద్ధమైనదే అయినప్పటికీ, అది న్యాయబద్ధమైనదిగా కూడా అనిపించాలని చెప్పక తప్పదు.






