మధ్యతరగతి బతుకులు భారం
దుప్పటి మొగిలి :
భారతదేశం స్వాతంత్య్రం పొంది 80 వసంతాలు దాటిన వేళ, నవభారత నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వర్గం మధ్యతరగతి మాత్రమే. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా, పన్నుల చెల్లింపులో అగ్రభాగం వహిస్తూ ఉత్పత్తి-వాడకాల చక్రాలను నడిపించే శ్రమశక్తి ఈ వర్గమే. కానీ, నేడు ఈ సమూహం తీవ్రమైన సామాజిక, ఆర్థిక సంక్షోభాన్ని ఎదు ర్కొంటోంది.
విద్య, వైద్యం మనిషి జీవితానికి అత్యవసరమైన రెండు ప్రాథమిక అవసరాలు. ఓ వ్యక్తి ఆరోగ్యంగా జీవించడానికి వైద్యం ఎంత అవసరమో, తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సామాజికంగా ఎదగ డానికి విద్య అంతే అవసరం. అందుకే ప్రజాస్వామ్య సమాజంలో విద్య, వైద్యాన్ని వ్యాపార వస్తువులుగా చూడకూడదు. భా రత రాజ్యాంగం నిర్దేశించిన సంక్షేమ రాజ్య భావనలో విద్య, వైద్యం అనేవి పౌరుల మౌలిక హక్కులు.
కానీ, గడిచిన మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా, ప్రభుత్వాలు తమ బాధ్యతల నుం చి తప్పుకొంటూ ఈ రెండు కీలక రంగాలను ప్రైవేట్ వ్యాపార వర్గాలకు అప్పగిస్తు న్నాయి. ఒకప్పుడు మంచి విద్య, సాధారణ వైద్యం కోసం కుటుంబ ఆదాయంలో పరిమిత మొత్తాన్ని ఖర్చు చేస్తే సరిపోయేది.
నేడు దేశంలో మధ్యతరగతి వారు తమ ఆదాయంలో సింహభాగాన్ని పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్య సంరక్షణకే కేటాయించాల్సి వస్తోంది. పిల్లల చదువు, కుటుంబ సభ్యుల వైద్యం రెండూ కలిసి మధ్యతరగతి కుటుంబ ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
విద్య ఉద్యోగం సంపాదించే సాధనం కాదు, సామాజిక పెట్టుబడి. జ్ఞానార్జనకు, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక చైతన్యంతో అసమానతలు తొలగించే సాధనం. అం దరికీ సమానంగా అందుబాటులో ఉండాల్సిన విద్యా వర్తమాన సమాజంలో ఓ లా భసాటి వ్యాపారంగా రూపాంతరం చెంద డం బాధాకరం.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల ఖాళీలు, పర్యవేక్షణ లోపం వల్ల తల్లిదండ్రుల్లో నమ్మకం సడలి ప్రైవేటు విద్యాసం స్థలే నాణ్యమైన విద్యకు మార్గమనే భావన బలపడింది. అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ బడులకే పంపాల్సిన మాన సిక ఒత్తిడిలో తల్లిదండ్రులు కూరుకుపోతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఎల్.కే.జీ నుంచే లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తుంటే సామాన్యుడి జేబులకు చిల్లుపడి కుటుంబాలు ఆర్థికంగాచితికిపోతున్నాయి.
ఇంజినీరింగ్, మెడిసిన్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు లక్షలు చెల్లించాల్సిందే. మధ్యతరగతి ప్రజలు ఆదాయంలో 30 ఫీజులకే చెల్లిస్తూ విద్యా రుణాల భారంతో తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కోచింగ్ ఫ్యాక్టరీలుగా మారిన సంస్థలు విద్యార్థులను యంత్రాలుగా మార్చి తల్లిదండ్రుల జీవితకాల పొ దుపును పిండేస్తున్నాయి. ఇది కొత్త సామాజి క అసమానతలకు దారితీస్తోంది.
నేడు సేవ భావాన్ని కోల్పోయి వ్యాపారంగా మారిన ఆరోగ్యరంగాన్ని గమనిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆధునిక వైద్యం అనేక ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ, దాని ఖర్చు సామాన్య కు టుంబానికి అందనంత ఎత్తులో ఉంది. సాధారణ పరీక్షలు, స్కానింగ్, మందులు మొదలుకుని శస్త్ర, దీర్ఘకాలిక చికిత్సల వర కు ఖర్చులు కుటుంబ బడ్జెట్‌ను తారుమారు చేస్తున్నాయి.
మధ్యతరగతి ప్రజల కు తీవ్రమైన అనారోగ్యం, శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు కార్పొరేట్ ఆసుపత్రు లు విధించే బిల్లులు సామాన్యుడి కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. అనవసరమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు, ఐసీయూ ఛార్జీలు, మందుల కమీషన్ల సంస్కృతి పెరిగిపోయింది.
రోగి కోలుకోవడం కంటే బిల్లు పెరగడమే లక్ష్యంగా కొన్ని యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యం ఎవ రి ఆర్థిక స్థితిని బట్టి నిర్ణయించే హక్కు కానప్పటికీ వైద్యం ఖరీదైన వస్తువుగా మారిన ప్పుడు డబ్బున్నవారికి అత్యుత్తమ చికిత్స, లేనివారికి పరిమిత చికిత్స అనే అసమానత పెరుగుతున్నది.
ఆరోగ్య బీమా విస్తరిస్తున్న ప్రతి సమస్యకు అది పరిష్కారం కాదు. బీమా ఉన్నా ప్రతి చికిత్స, ప్రతి పరీక్ష, ప్రతి ఔషధం పూ ర్తిగా కవరవుతుందని హామీ లేదు. అందువల్ల బీమా వ్యవస్థతో పాటు అందుబాటు ధరలో ఉన్న వైద్య వ్యవస్థ కూడా అవస రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యుల కొరత, మందుల లేమి, పారిశుధ్య లోపం తాండవిస్తున్నాయి. ఉచిత వైద్యం అందాల్సిన చోట సరైన సేవలు లేకపోవడంతో, ఆఖరికి రెక్కాడితే గానీ డొక్కాడని వారు సైతం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు.
నేడు విద్య, వైద్యం సామాన్యుడికి అందుబాటులో లేని అత్యంత ఖరీదైన సరుకులుగా మారడం వల్ల సమాజంపై నా, కుటుంబ వ్యవస్థలపైనా పడుతున్న ప్రభావం బహుముఖమైనది. మధ్యతరగతి వ్యక్తి ఇంటి అద్దె, రుణ వాయిదాలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్, రవాణా ఖర్చులతోపాటు విద్యా వ్యయం పెరుగుతోంది. దీంతో పొదుపు తగ్గి భవిష్యత్ అవ సరాల కోసం దాచుకోవాల్సిన సొమ్ము పిల్లల చదువులకో, కుటుంబ సభ్యుల వైద్యానికో ఖర్చయిపోతోంది. ఫీజులు, ఆసుపత్రి బిల్లుల కోసం బ్యాంక్ రుణాలు, అధిక వడ్డీల వల్ల కుటుంబాలు జీవితాం తం ఈఎంఐల చక్రబంధంలో చిక్కుకుంటున్నాయి.
ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ గల భారతదేశం జీడీపీలో విద్య, వైద్య రంగాలకు చేస్తున్న కేటాయింపులు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అత్యల్పం. కొఠారీ కమిషన్ సిఫారసు ప్రకా రం జీడీపీలో కనీసం 6% విద్యకు కేటాయించాలి. కానీ దశాబ్దాలు గడుస్తున్నా కే టాయింపులు 3% దాటడం లేదు. జాతీ య ఆరోగ్య విధానం ప్రకారం జీడీపీలో కనీసం 2.5% వైద్యానికి కేటాయించాలి. కానీ, ప్రస్తుతం అది 1.2% నుంచి 1.5% మధ్యనే ఊగిసలాడుతోంది.
జీడీపీలో కే టాయింపులు పెంచకుండా ప్రైవేట్ రంగా న్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు తమ రా జ్యాంగబద్ధ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి. ఈ సంక్షోభం నుంచి మధ్యతరగ తిని, పేద వర్గాలను గట్టెక్కించాలంటే మా ర్పులు అత్యవసరం. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లలో విద్యకు కనీసం 6%, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ తరగతు లను అందుబాటులోకి తెచ్చి ప్రజల్లో న మ్మకం పెంపొందించాలి.
వైద్యానికి 2.5% పైగా బడ్జెట్ కేటాయింపులు అమలు చే యాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థా యి నుంచే నాణ్యమైన ఉచిత వైద్యం, మం దులు అందుబాటులో ఉండేలా సార్వత్రిక ఆరోగ్య రక్షణ విధానాన్ని బలోపేతం చేయాలి. ఉచిత ప్రాథమిక చికిత్సలతో పాటు, మధ్యతరగతి వర్గాలందరికీ అందుబాటు ధరలలో సంపూర్ణ ఆరోగ్య బీమా పథకాలను విస్తరించాలి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల వైద్య రుసుములు, పరీక్షల ధరలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి.
విద్య, వైద్యం మనిషి జీవితానికి విలాసాలు కావు. సమసమాజ స్థాపనకు, దేశ సమగ్ర వికాసానికి విద్య, వైద్యం రెండు కళ్లు వంటివి. ప్రభుత్వాలు విద్య, వైద్యాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. అవి సమాజ భవిష్యత్తును నిర్మించే పునాదులు. ఆ పునాదులు బలహీనపడితే దేశ అభివృద్ధి భవనం ఎంత ఎత్తుగా నిర్మించినా, అది అసమానతల బరువుతో నిలబడదు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఆర్థిక భద్రత లభించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది.
దేశ జనాభాలో అత్యధికంగా ఉంటూ, పన్నుల రూపంలో దేశ ప్రగతికి ఇంధనంగా మారుతున్న మధ్యతరగతిని ఈ భారం నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రాథమిక సేవలను పౌరులకు తక్కువ ఖర్చుతో అందించినప్పుడే దేశంలో నిజమైన ఆర్థిక, సామాజిక న్యాయం జరిగి నవభారత స్వప్నం సాకారమవుతుంది.
వ్యాసకర్త సెల్: 8466827118






