26 May, 2026 | 4:45 AM

బీఆర్‌ఎస్ బలోపేతానికి రుణమాఫీ అస్త్రం

20-08-2024 01:01 AM
  1. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్లాన్
  2. స్థ్ధానిక సంస్థల పోరులో పరువు కోసం తంటాలు
  3. కొందరి రైతులనే రుణ విముక్తి చేసిందని విమర్శలు
  4. గ్రామాల్లో విస్తృత ప్రచారానికి పార్టీ శ్రేణులు సిద్ధం

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన బలం తెచ్చుకునేందుకు రుణమాఫీ అస్త్రం పేరుతో ప్రజలకు వద్దకు వెళ్లేందుకు బీఆర్‌ఎస్ పార్టీ నడుం బిగించింది. రేవంత్ సర్కార్ చేసే తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రజల ఆదరణ పొందేందుకు ఆ పార్టీ పెద్దలు తంటాలు పడుతున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, పింఛన్ల పెంపు, ఉచిత విద్యుత్ అంశాలపై గతంలో ఎంత ప్రచారం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో  ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించి ఉనికి కాపాడుకునేందుకు ఆపార్టీ సీనియర్లు చెమటోడ్చుతున్నారు. సర్కార్ గత నెల 18వ తేదీ నుంచి రుణమాపీ మొదటి విడుత లక్ష రూపాయలు మాఫీ పథకానికి శ్రీకారం చుట్టి 11లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,096 కోట్లు జమ చేసింది.

రెండో విడుతలో జూలై 31న 6.40లక్షల మంది రైతులకు మరో రూ. 6వేల కోట్లు, ఈనెల 15న మూడో విడుతలో 2లక్షల లోపు రుణాలు 4.46 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 5644 కోట్లు జమ చేసింది. మూడు దఫాలుగా 22, 37,848 రైతులకు రూ. 17,933 కోట్లు ఖాతాలో వేసింది.  వరంగల్ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని, రూ. 40వేల కోట్లు రుణమాఫీకి కేటాయిస్తామని చివరికి రూ. 17వేల కోట్లు చెల్లించి చేతులు దులుపు కుందని విమర్శలు కురిపిస్తున్నారు.

రుణమాఫీ అమలుపై ఆరోపణలు 

 గత నాలుగు రోజులుగా గులాబీ నేతలంతా తమ పార్టీ ఆఫీసులో వరుస సమావేశాలు ఏర్పాటు చేసి రుణమాఫీ అమలుపై ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాక గ్రామ, గ్రామాన  ప్రభు త్వ మోసాలను ఎండగట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తమ నియోజకవర్గం పరిధిలోని గ్రామ కమిటీల ద్వారా ఇంటింటికి రుణమాఫీలో జరిగిన అన్యాయాలను వివరించాలని సూచించారు. 

కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టి   

కొంతమంది బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో  వారి స్థానంలో కొత్తవారికి బాధ్యత లు అప్పగించాలని పార్టీ నేతలు చెబుతున్నారు. బాధ్యులు లేకపోవడం కూడా పార్టీకి కొంత నష్టం జరుగుతుందని, వెంటనే అక్కడ చురుకుగా ఉండే నాయకులకు బాధ్యతలు అప్పగించ నున్నట్లు తెలిసింది. స్టేషన్ ఘన్‌పూర్, చేవెళ్ల, బాన్సువాడ, జగిత్యాల, భద్రాచలం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గద్వాల్ నియోజకవర్గాల్లో  మండల, గ్రామస్థాయి అధ్యక్ష, కార్యదర్శులు కాంగ్రెస్‌లో చేరారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలి 

త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని, పెద్ద సంఖ్యలో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మండల, జిల్లా నాయకత్వం తగిన ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఓట్లకంటే రెండింతలు ఎక్కువ పడే విధంగా చూడాలని సూచినట్లు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వెల్లడించారు. రుణమాఫీ వర్తించని రైతులందరినీ ఏకం చేసి వారితో ఆందోళనలు నిర్వహించి తమ వైపు తిప్పకు నేలా ఎత్తుగడలు వేయాలని, లోకల్ ఎన్నికల్లో కూడా ఉనికి కో ల్పోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమని నేతలను హెచ్చరించినట్లు తెలిసిం ది. ఎక్కడైనా రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిల వాలని సూచించినట్లు సమాచారం.