26 May, 2026 | 3:54 AM

ఏపీలో కరువు అనే మాట వినిపించకూడదు

20-08-2024 01:03 AM
  1. పాత రోజులు మర్చిపోయి బాధ్యతగా పనిచేయాలి 
  2. ఏపీ సీఎం చంద్రబాబు 
  3. సోమశిల ప్రాజెక్టును సందర్శించిన సీబీఎన్ 

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో.. ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్నారు. సోమవారం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు. మొత్తం రిజర్వాయర్లలో 989 టీఎంసీ నీళ్లు నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇప్పటీ వరకు 692 టీఎంసీలు నీళ్లు నిల్వ చేసుకున్నామన్నారు. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడన్నారు.

70 శాతం ప్రాజెక్టుల్లో నీళ్లు వచ్చాయని, నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ‘ డబ్బులివ్వకపోతే కాంట్రాక్టర్ పని చేస్తారా..? గేటు పెట్టలేని ప్రభుత్వం ఐదేళ్లు పాలించింది. మనది  ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వమిది. కష్టాలున్నా.. ఖాళీ ఖజానా ఉన్నా.. ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మాది. పాత రోజులు మర్చిపోవాలని అందరికి చెబుతున్నా. బాధ్యతగా పనిచేయాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. గత ప్రభుత్వంలో సర్వే రాళ్లపై బొమ్మలకు రూ. 700 కోట్లు ఖర్చు పెట్టారు. పేపర్లకు ప్రకటనల కోసం రూ. 403 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ  డబ్బుల్లో రూ. 200 కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రుషికొండ కొట్టేసి రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టించుకున్నారు ’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.