27 July, 2026 | 11:19 PM

ఇదేం ‘లోకల్’ నియమం?

29-05-2024 12:05 AM

హైదరాబాద్, మే 28: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ అడ్మిషన్ల ప్రక్రియలో ‘స్థానిక’ కోటా తీవ్ర వివాదాస్పదమవుతున్నది. స్థానికులు కొద్దిరోజులు ఇతర రాష్ట్రాలకో, ఇతర దేశాలకో బతుకుదెరువు కోసం పోయినా నాన్‌లోకల్ కిందికే వస్తున్నారు. దీంతో ఏటా లోకల్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధానంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ఉద్యోగాలకు సంబంధించిన లోకల్ విధానం

1. జీవో నంబర్ 124లోని పేరా 7 లో లోకల్ విధానాన్ని వివరించారు. దీని ప్రకారం ఏదైనా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు కనీస విద్యార్హత నిర్ణయిస్తే, అందులో లోకల్ క్యాండిడేట్‌గా అర్హత సాధించాలంటే వరుసగా నాలుగేండ్లకు తగ్గకుండా ఆ ప్రాంతం (రాష్ట్రం)లోనే చదివి ఉండాలి. అందులోనూ ఆ కనీస అర్హత చివరి సంవత్సరం లేదా, ప్రారంభ సంవత్సరం అయినా తప్పకుండా ఆ ప్రాంతం లోని విద్యా సంస్థల్లోనే చదవి ఉండాలి. 

2. ఒకవేళ అభ్యర్థి కనీస విద్యార్హత అయిన కోర్సు వరుసగా నాలుగేండ్లు స్థానిక విద్యా సంస్థల్లో చదివి ఉండకపోతే, అందులో ఏదో ఒక ఏడాది స్థానంగా చదవి ఉండకపోతే.. అతడు స్థానికంగా కనీసం వరుసగా నాలుగేండ్లకు తగ్గకుండా స్థానికంగా నివసిస్తూ అయినా ఉండాలి. 

3. ఒకవేళ సదరు పోస్టుకు కనీస విద్యార్హత నిర్ణయించని పక్షంలో ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నాటికి వరుసగా నాలుగేండ్లకు తగ్గకుండా స్థానికంగా నివసిస్తూ ఉండాలి. 

విద్యా సంస్థలో ప్రవేశాలకు లోకల్ విధానం

1. 2017, జూలై 5న జారీచేసిన జీవో నంబర్ 114 (హెచ్‌ఎం అండ్ డబ్ల్యూడీ)లోని రూల్ 3 (III) (B) (a) ప్రకారం విద్యార్థి లోకల్‌గా పరిగణించబడాలంటే అతడు/ఆమె మొదటిసారి అర్హత పరీక్షకు హాజరవటానికి ముందు వరుసగా విద్యా సంవత్సరాలు స్థానికంగా చదివి ఉండాలి. 

2. దీంతోపాటు రూల్ 3(III)(B)(b) ప్రకారం విద్యార్థి అర్హత పరీక్షకు మొదటిసారి హాజరవాటినికి ముందు వరుసగా నాలుగేండ్లు స్థానికంగా నివసించి ఉండటం తప్పనిసరి. 

2017లో ప్రభుత్వం జారీచేసిన లోకల్ రూల్స్ ప్రధాన లక్ష్యం ఇంటర్మీడియట్ (12వ తరగతి) పూర్తిచేసిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించటం. అయితే ఇందులో పేర్కొన్న స్పెషలైజ్డ్ విద్యా సంస్థల్లో 85 శాతం కోటా, కాంపిటెంట్ అథారిటీ సీట్ల కేటాయింపు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో స్థానికత ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న విధానం అసంబద్ధంగా ఉన్నది. ముఖ్యంగా లోకల్ విద్యార్థులతోపాటు అర్హులందరికీ మెడికల్ విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు కోసం తెచ్చిన రూల్స్‌కు 2017 లక్ష్యానికి రూల్ 3(III)(B)(b) హేతుబద్ధత చేకూర్చుటం లేదు.

తెలంగాణ శాశ్వత నివాసితులైన ఒక విద్యార్థి అనుకోని కారణాలవల్ల అర్హత కోర్సును రాష్ట్రం బయట పూర్తిచేసి ఉంటే.. వారికి 85 శాతం లోకల్ కోటా వర్తించటం లేదు. వరుసగా నాలుగేండ్లకు తగ్గకుండా స్థానికంగా చదవలేదన్న, స్థాని కంగా నివసించలేదన్న కారణంతో వారికి లోక ల్ కోటాలో సీటు నిరాకరించటం అన్యాయం. 

ఆ రూల్ రాజ్యాంగ వ్యతిరేకం

రూల్స్ 2017లోని నిబంధన 3(II)(B) ఏకపక్షంగా ఉన్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను అతిక్రమిస్తున్నది. 2023 నీట్ అడ్మిషన్లలో తెలంగాణ శాశ్వత నివాసితులను నాన్‌లోకల్ కోటా కింద పరిగణించటంపై పలువురు పిల్‌లు దాఖలుచేశారు. కేసులు వేసిన విద్యార్థులు తెలంగాణలో శాశ్వత నివాసితులైనా కొంత కాలం రాష్ట్రం అవతల చదవినందుకు, నివసించినందుకు వారిని నాన్ లోకల్స్‌గా పరిణించా రు. వారి కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనో ఉద్యోగాలు, పనులు చేయాల్సి వస్తే.. అనివార్యంగా వారితో వెళ్లిన విద్యార్థులకు ఈ నిబంధన కారణంగా తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విధానం పూర్తిగా ఏకపక్షమే.