27 July, 2026 | 10:27 PM

ఢిల్లీ మంత్రి అతీషికి కోర్టు నోటీసులు

29-05-2024 12:12 AM

న్యూఢిల్లీ, మే 28 : ఢిల్లీ మంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఏఏపీ) సీనియర్ నాయకురాలు అతీషి మర్లినాకు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 29న కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధిపతి ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అతీషికి నోటీసులు ఇచ్చింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు ఆఫర్ చేసి పార్టీలోకి ఆహ్వానిస్తోందని ఈ ఏడాది మొదట్లో అతీషి ఆరోపణలు చేశారు. అయితే, అతీషి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆమె వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ప్రవీణ్ శంకర్ కపూర్ పరువునష్టం దావా వేశారు. ఇదే కేసులో ప్రవీణ్ శంకర్ కపూర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ప్రతివాదిగా చేర్చారు. అయితే, అతీషికి సమన్లు జారీ చేసిన కోర్టు కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అనంతరం పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్న కీలక నేతల్లో అతీషి ఒకరు.