ఫోన్ ట్యాపింగ్ విషయం ఎలా బయటపడిందో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నింటికీ సీబీఐ అనే కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాత్రం అడగరా? అని సీఎం ప్రశ్నించారు. అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్యాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందన్నారు. హార్డ్ డిస్కులు, డేటా బాగ్ అప్ ఎక్కడుందో అధికారులే తేల్చాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదు.. అలాంటి పనులు చేయమని సీఎం స్పష్టం చేశారు.
తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లు ట్యాప్ చేయవచ్చని తెలిపారు. డేటా ఉందో, లేదో.. ఎలా మాయం చేశారో అంతా దర్యాప్తులో తేలుతోందని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక విద్యుత్ విషయాలన్నీ వివరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలన్నారు. పోరాటాలు గుర్తుకువచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని సీఎం తెలిపారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి అప్పగించామని ఆయన సూచించారు.






