calender_icon.png 22 February, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గళమెత్తిన మహిళా శక్తి

22-02-2026 01:59:41 AM

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ

  1. కాంగ్రెస్ నుంచి టికెట్ రాక..స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.. విజయం
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో పదవి
  3. చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేశాక తిరిగి కాంగ్రెస్‌లోకి..

ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బీసీ (మున్నూరు కాపు) మహిళ ఎన్నికైయింది. బజార్‌హత్నూర్ మండలం దేగామ గ్రామానికి చెందిన బండారి అనూష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. చైర్‌పర్సన్ పదవీ బీసీ మహిళా రిజర్వ్ కావడంతో వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు చైర్‌పర్సన్ కోసం పోటీ పడ్డారు.

దీంతో 45వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ బండారి అనూష సతీష్ టికెట్ లభించకపోవడం చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు రావడంతో అన్ని పార్టీల మద్దతుతో చైర్మన్ సీటు కైవసం కోసం ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. గెలుపొందిన బండారి అనూష సతీష్‌ను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పార్టీ పెద్దలు ఆమె ను సంప్రదించారు.

చివరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, స్వతంత్రులు కలిసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి సతీష్‌ను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన చైర్‌ర్సన్ అనూష భర్త బండారి సతీష్ గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మాజీమంత్రి జోగు రామన్నకు సన్నిహితుడిగా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతకాలం క్రితం కాంగ్రెస్‌లో చేరారు.

కానీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో 45వ వార్డు మహిళా రిజర్డ్ కావడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా తన భార్య అనూషను బరిలో దించారు. చివరకు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అనూష సతీష్‌కు అన్ని పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో చైర్పర్సన్‌గా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.

జనగామ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

కడకంచి బాలమణి, చైర్‌పర్సన్, జనగామ మున్సిపాలిటీ

జనగామ, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంగా ఉన్న జనగా మ మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అ మలు చేస్తాం. రాజకీయాల కు కొత్త అయినప్పటికీ పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా సలహాలు సూచనలు స్వీకరిస్తాం. ప్రభుత్వ సహకారంతో జనగామ పట్టణాన్ని అన్ని విధాలుగా ప్రగతిలో పరిగె త్తిస్తాం. అండర్ డ్రైనేజీకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. అలాగే రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. 

ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తా

నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అప్పల కావ్య

నిర్మల్ ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీ చెందిన అప్పల కావ్య మున్నూరు కాపు సామాజిక వర్గం. బీసీ(డీ)కి చెందిన అప్పల కావ్య అదే సామాజిక వర్గం చెందిన అప్పల గణేష్ చక్రవర్తి 2007 మే 13న వివాహం చేసుకున్నారు. వారి తాత అప్పారావు నరసయ్య 1981 నుంచి 83 వరకు మున్సిపల్ చైర్మన్‌గా చేశారు. ఆయన కోడలు అప్పల అనురాధ మహేష్ బీసీ రిజర్వేషన్‌తో 2005 నుంచి 10 మున్సిపల్ చైర్ పర్సన్‌గా పని చేశారు.

వీరి అన్న కుమారుడైన అప్పల గణి చక్రవర్తి 2014లో అప్పటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో బీఎస్పీ గుర్తుపై పోటీ చేసి గెలుపొంది, 2019 వరకు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో జనరల్ మహిళకు కేటాయించడంతో బీసీ ముద్దుబిడ్డ మున్నూరు కాపు సామాజికవర్గం చెందిన అప్పల కావ్య చైర్‌పర్సన్ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించారు. రాజకీయ కుటుంబ నేపథ్యం..

మూడుసార్లు ఆ కుటుంబానికి చైర్మన్ పదవి దక్కడంతో ఎంఎస్సీ బాటనీ ఉన్నత చదువు చదివి, రాజకీయ సామాజిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న అప్పల కావ్యను కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. పట్టణంలోని 36వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన అప్పల కావ్య చైర్‌పర్సన్‌గా ఎన్నికయింది.

నిర్మల్ పట్టణంపై పూర్తి అవగాహన రజక కుటుంబ నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీలో అవినీతిని నిర్మూలించి, ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణ స్వీకారోత్సవం రోజు ఆమె ప్రకటించింది. ఈమెకు ఇద్దరు సంతానం కాగా పాప బాబు చదువుకుంటున్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉంటా

మా ఎమ్మెల్యే సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తా

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్

మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి డిప్యూటీ మేయర్‌గా నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్పొరేషన్ ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. మా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, మాజీ డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సలహాలు, సూచనలు పాటిస్తూ నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ సమస్యలు పరిస్కరిస్తా. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ఎత్తయిన ప్రాంతాల్లో తాగునీటికి కొంచెం ఇబ్బందులు ఉన్నట్లుగా గుర్తించాం. రానున్నది వేసవికాలం. కాబట్టి వాటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తాను.

తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం తదితరాలతో పాటు కార్పొరేషన్‌లో ఏయే సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తా. నా భర్త సల్ల మహేశ్ కౌన్సిలర్‌గా ప్రజల్లోకి వెళ్లి ఎలా ప్రజాసమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందారో గమనించాను. నేను కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాను. కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. వాటిపై ప్రత్యేకంగా చొరవ తీసుకుంటాను. 

నా భర్త సల్ల మహేశ్ మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌గా చేశారు. నేను బీఎస్సీ బీఈడీ చేశాను. నాకు ఇద్దరు పిల్లలు జతిన్‌జై, జనిత్‌జై ఉన్నారు.

ములుగులో రోడ్లు, డ్రెయినేజీలకు ప్రాధాన్య

ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ

ములుగు, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ములుగు పట్టణంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంటూ త్వరలోనే సమగ్ర చర్యలు చేపడతామని ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ వెల్లడించారు. చిన్నపాటి వర్షానికే మురుగు, వర్షపు నీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం కోసం మంత్రి సీతక్క సహకారంతో ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించే దిశగా నిపుణులతో సమగ్ర డిజైన్ రూపొందించి, మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు సమీకరించి దశలవారీగా రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతో ములుగు పట్టణాన్ని శుభ్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

అభివృద్ధికి ముందుండి కృషిచేస్తాం

లక్షెట్టిపేట మున్సిపల్ వైస్‌చైర్మన్ మోత్కురి రాజేశ్వరి

లక్షెట్టిపేట టౌన్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి):  లక్షెట్టిపేట మున్సిపల్ అభివృద్ధికి ఎల్లవేళల ముందుంటాను. చైర్మన్, వైస్‌చైర్మన్ ఇద్దరం మహిళలమే కావడంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పని చేసుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీ అభివృద్ధిలో తప్పనిసరి ముందుండి అభివృద్ధి చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తా. మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముందుగా దృష్టి సారించి పరిష్కరించేందుకు శ్రమిస్తాను.

మాకు మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మున్సిపాలిటీలో ప్రగతి సాధించి చూపిస్తాం. మా ఎమ్మెల్యే మద్దతు బాగా ఉంది. ఇప్పటికే మోడల్ స్కూల్, అధునాతనమైన హాస్పిటల్ నిర్మించి అభివృద్ధిలో దూసుకుపోతున్నం.

ఎమ్మెల్యే మద్దతుతో మరింత ముందుకు సాగుతాం. నేను 2007 నుంచి 2012 వరకు ఎంపీటీసీగా, 2013 నుంచి 2018 వరకు లక్షెట్టిపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలిగా, 2019 నుంచి 2025 వరకు లక్షెట్టిపేట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలిగా పనిచేశాను. 2026 నుంచి లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 4వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాను. గత రాజకీయ అనుభవంతో మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాను.

‘వేం’ కృషితో కేసముద్రాన్ని రోల్ మోడల్ చేస్తా

కేసముద్రం వైస్‌చైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమ

మహబూబాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా బీసీల్లోని యాదవ వర్గానికి చెందిన డాక్టర్ అల్లం రమ ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కృషితో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా.

గతంలో సర్పంచ్‌గా నిర్వహించిన పదవి అనుభవంతో కేసముద్రంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తా. ఇప్పటికే అన్ని విధాలుగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన జరిగింది. వార్డుల వారీగా సమస్యలపై సర్వే నిర్వహించి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిష్పక్ష పాతంగా అమలయ్యే విధంగా కృషి చేస్తా.

నర్సంపేట సమగ్ర అభివృద్ధికి కృషి

పెండెం శ్రీలక్ష్మిపద్మశాలీ, చైర్‌పర్సన్, నర్సంపేట మున్సిపాలిటీ, వరంగల్ జిల్లా

వరంగల్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): స్వతంత్ర సమరయోధుడు పెండెం కట్టయ్య వారసత్వం, రాజకీయ నేపథ్యం, వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో బీసీనైన పద్మశాలీ బిడ్డకు చైర్మన్ పదవి దక్కింది. ప్రభుత్వం ద్వారా నర్సంపేట సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తా. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వరంగల్ జిల్లాలో నర్సంపేట మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తా. 

అభివృద్ధిలో పట్టణాన్ని ఆదర్శంగా నిలబెడతా

బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి 

బెల్లంపల్లి, ఫిబ్రవరి 21(విజయక్రాంతి) : బెల్లంపల్లి మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడతూ అభివృద్ధి పథంలో అన్ని హంగుల్లో తీర్చిదిద్దుతా. కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఒక ప్రణాళికను తయారు చేస్తాం. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, పట్టణ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ చేపడతాను. విశాలమైన రోడ్లు, సౌకర్యతమైన మురికి కాలువలు, అంతర్గత రహదారులు, పారిశుధ్య సమస్యలను పరిష్కరిస్తాం.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశీస్సులు, కౌన్సిల్ సహకారంతో మునుపెన్నడూ చూడని పట్టణంగా బెల్లంపల్లిని ఆవిష్కరిస్తా. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రతి సభ్యుడిని గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడం ప్రతి కౌన్సిలర్ బాధ్యత. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాల్ని పక్కన పెట్టేసి పనిచేస్తాం.

అభివృద్ధికి మూలమైన నిధుల కోసం మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ సాకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం మాదే కనుక అభివృద్ధి అనుకున్న రీతిలో చేస్తామనే నమ్మకం ఉంది. అందరినీ కలుపుకుని పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుపోతాం. ప్రజలకు సేవకులుగా పట్టణ అభివృద్ధికి వారధులుగా పనిచేస్తాం. పూర్తి పారదర్శక, అవినీతి రహిత పరిపాలన అందించడమే ప్రధాన ధ్యేయంగా తన పరిపాలన మార్క్‌ను చూపిస్తా.