21 March, 2026 | 3:17 AM

సాగునీటి రంగానికి తక్కువ నిధులు

21-03-2026 01:49 AM
  1. 22,615 కోట్లు కేటాయింపు

గతేడాదకంటే 758 కోట్లు తక్కువ

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు ప్ర భుత్వం రూ.22,615 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.23,373 కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.758 కోట్ల మేర కోత విధించారు. శాతాల పరంగా చూస్తే దాదాపు 3.2 శాతం తగ్గుదల నమోదైంది. సాధారణంగా ఏటా పెరుగుతూ వచ్చే నీటి పారుదల శాఖ కేటాయింపులు ఈసారి తగ్గడం పాలక వర్గాల ప్రాధాన్యతలపై చర్చకు దారితీస్తోంది.

ఇరిగేషన్ రంగం భారీ మూలధన వ్యయంతో కూడుకున్నది. పెద్ద ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం వంటి పనులకు భారీ నిధులు అవసరం. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల కంటే ఇప్పటికే ప్రారంభమైన పనుల పూర్తి మీదే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందువల్ల కొత్తగా పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు అవసరం లేకపోవడంతో కొంత కోత విధించినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ- సమతుల్యత కూడా ఈ తగ్గుదలకు కారణమయ్యి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సంక్షేమ, సామాజిక రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మూలధన వ్యయ రంగాల్లో స్వల్ప కోతలు విధించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరిగేషన్ నిధుల తగ్గుదల ప్రత్యక్షంగా పలు కీలక ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఎత్తిపోతల పథకాల విస్తరణ, కాల్వల నిర్మాణం, మరమ్మతులు, రిజర్వాయర్ల సామర్థ్య పెంపు, కొత్త ఆయకట్టు అభివృద్ధి, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు నిధుల కొరత కారణంగా నెమ్మదించే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా రైతులకు కొత్తగా నీరు అందించే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. దీంతో వ్యవసాయ ఉత్పాదకతపై పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూర్తిస్థా యిలో నీరు అందకపోవడం, కాల్వల సమస్యలు ఉండగా, నిధుల కోత పరిస్థితిని మరింత క్లిష్టం చేయవచ్చని రైతు సంఘాలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి, వాటి ద్వారా ఎక్కువ లాభం రైతులకు చేకూర్చే ప్రయత్నం చేస్తామని చెబుతోంది. తక్కువ నిధులతో గరిష్ట ప్రయోజనం అందించేలా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతామని హామీ ఇస్తోంది.