మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
యాదాద్రి భువనగిరి, మే 25 (విజయక్రాంతి): ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగు మాదిగలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని భువవనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ కోరారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తెలంగాణ ఏర్పడిన తర్వాత మాదిగలకు రాజకీయంగా, ఆర్థికంగా తీరని అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రజాపాలనలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు సముచిత న్యాయం చేస్తామని, కీలకమైన పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ ఓటింగ్ సరళిపై ఆరా తీసిన ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏ సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన వెంట సీఎంను కలిసిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్ ఈరపాక నర్సింహ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






