7 August, 2026 | 2:35 PM

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

07-08-2026 01:26 PM

గుడిహత్నూర్, (విజయక్రాంతి) :  కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెక్కులను అందజేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోనీ రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఎంతో గొప్ప సంక్షేమ కార్యక్రమమని అన్నారు.

పేద కుటుంబాల్లో వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.