నరైన్ విధ్వంసం

06-05-2024 02:49:30 AM

లక్నోపై కోల్‌కతా విజయం

81 పరుగులతో సునీల్ మెరుపులు

ప్లేఆఫ్ ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్ మరోసారి విజృంభించింది. సునీల్ నరైన్ సిక్సర్లతో స్టేడియాన్ని మరోసారి హోరెత్తించాడు. సెంచరీని తృటిలో మిస్ అయినప్పటికీ అతని విధ్వంసంలో ఇంచు కూడా తేడా లేదు. బౌలర్ ఎవరైనా సరే బాదుడే లక్ష్యంగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. నరైన్ విధ్వంసానికి తోడు బౌలర్ల సమిష్టి కృషితో కోల్‌కతా ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకెళ్లింది. సొంతగడ్డపై కోల్‌కతాను చిత్తు చేసి ప్లేఆఫ్ రేసులో ముందుకెళ్లాలని భావించిన లక్నోకు నిరాశే ఎదురైంది. కోల్‌కతా బౌలర్ల ధాటికి లక్నో బ్యాటింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది.

లక్నో: ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మిగతావారిలో ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32), రఘువంశీ (26 బంతుల్లో 32) పర్వాలేదనిపించగా.. ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) స్టేడియాన్ని హోరెత్తించాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు పడగొట్టగా.. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి, యుద్‌వీర్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కస్ స్టోయినిస్ (21 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (21 బంతుల్లో 25, 3 ఫోర్లు) పర్వాలేదనిపించగా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తిలు చెరో మూడు వికెట్లు తీయగా.. రసెల్ 2, స్టార్క్, నరైన్‌లు ఒక్కో వికెట్ తీశారు. 

నరైన్ దూకుడు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు సాల్ట్, నరైన్ మరోసారి శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. అనంతరం 32 పరుగులు చేసిన సాల్ట్ వెనుదిరిగాడు. సాల్ట్ ఉన్నంతసేపు నెమ్మదిగా ఆడిన నరైన్ ఆ తర్వాత బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. 27 బంతుల్లోనే నరైన్ ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. రఘువంశీ వెనుదిరిగినప్పటికి నరైన్ తన జోరును మాత్రం ఆపలేదు. లక్నో బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడిన నరైన్ బౌండీరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 140 పరుగులు వద్ద రవి బిష్ణోయి నరైన్‌ను పెవిలియన్ చేర్చడంతో అతని మెరుపులకు బ్రేక్ పడింది. ఇక్కడి నుంచి కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే ఆఖర్లో వచ్చిన రమణ్‌దీప్ సింగ్ ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి 200 పరుగుల స్కోరు వద్దే ఆగిపోతుందనుకున్న కేకేఆర్ స్కోరును 230 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లక్నో ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కేఎల్ రాహుల్, స్టోయినిస్ ఉన్నంతసేపు మ్యాచ్ గెలుపుపై ఆశలు ఉన్నప్పటికి వారిద్దరు ఔటైన తర్వాత లక్నో ఇక కోలుకోలేకపోయింది. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తిలు చెరో ఎండ్ నుంచి దాడి చేయడంతో లక్నో బ్యాటింగ్ ముందుకు సాగలేకపోయింది. రవి బిష్ణోయి చివరి వికెట్‌గా వెనుదిరగడంతో లక్నో ఇన్నింగ్స్‌కు తెరపడింది.

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ర.రే పా

కోల్‌కతా 11 8 3 1.45 16

రాజస్థాన్ 10 8 2 0.62 16

చెన్నై 11 6 5 0.70 12

హైదరాబాద్ 10 6 4 0.07 12

లక్నో 11 6 5 12

ఢిల్లీ 11 5 6 10

బెంగళూరు 11 4 7 8

పంజాబ్ 11 4 7 8

గుజరాత్ 11 4 7 8

ముంబై 11 3 8 6

నోట్: మ్యా గె ఓ ర.రే పావూ