శభాష్ జ్యోతిక
ఒలింపిక్స్‌కు భారత మహిళ జట్టు అర్హత
పురుషుల బృందం కూడా
వరల్డ్ అథ్లెటిక్స్ రిలే
చిరుతను తలపించిన తెలుగమ్మాయి
నాస్సౌ (బహమాస్): అథ్లెటిక్స్ ట్రాక్‌పై తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ దుమ్మురేపింది. ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీల్లో చిరుతను తలపిస్తూ.. 4 x 400 ఈవెంట్‌లో భారత మహిళల బృందం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించింది. జ్యోతిక, రుపాల్ చౌదరీ, ఎంఆర్ పూవమ్మ, సుభ వెంకటేశన్‌తో కూడిన భారత మహిళల జట్టు వరల్డ్ అథ్లెటిక్స్ రిలేలో రెండో స్థానంలో నిలిచి.. విశ్వక్రీడల బెర్త్ దక్కించుకుంది. సోమవారం జరిగిన 4 x 400 పోటీల్లో మన అమ్మాయిలు 3 నిమిషాల 29.35 సెకన్లలో లక్ష్యాన్ని చేరారు. ఈ రిలేలో జమైకా అథ్లెట్లు 3 నిమిషాల 28.54 సెకన్లతో అగ్రస్థానం దక్కించుకోగా.. భారత జట్టుకు రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.
రిలేలో భాగంగా రెండో లెగ్‌లో పరుగు తీసిన జ్యోతిక.. వాయువేగంతో జట్టు విజయంలో భాగమైంది. 4 x 400 ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇది నాలుగోసారి. మరోవైపు పురుషుల జట్టు కూడా పారిస్ టికెట్ పట్టేసింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పురుషుల 4 x 400 టీమ్.. వరల్డ్ అథ్లెటిక్స్ రిలేలో రెండో స్థానంలో నిలవడం ద్వారా విశ్వక్రీడలకు ఎంపికైంది. మహమ్మద్ యహియా, మహమ్మద్ అజ్మల్, రాజీవ్, జాకబ్‌తో కూడిన పురుషుల బృందం 4x400మీ రిలేను 3 నిమిషాల 3.23 సెకన్లలో పూర్తి చేసింది. అమెరికా (2 ని.59.95 సెకన్లు) టాప్ ప్లేస్ దక్కించుకుంది. గత రెండేళ్లుగా సంచలన ప్రదర్శన చేస్తున్న పురుషుల రిలే జట్టు.. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
నాన్నను చూసే అథ్లెటిక్స్ వైపు వచ్చా. ఆయన కలే నా కల. నేను ఒలింపిక్స్‌లో పతకం సాధించడం నా తండ్రి ఆశయం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మా బృందం పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దేశానికి పతకం తీసుకురావడం కోసం మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరు 51 సెకన్ల టైమింగ్ నమోదు చేస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
- జ్యోతిక
తండ్రి చూపిన బాటలో..
ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై మరో తెలుగు తేజం తళుక్కున మెరిసింది. తండ్రి కలను తన కలగా మార్చుకొని.. ఆయనను గర్వపడేలా చేయడమే లక్ష్యంగా ట్రాక్‌పై కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఆ అమ్మాయి.. సంచలన ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పెద్దగా అంచనాలు లేని 4 x 400 ఈవెంట్‌లో భారత మహిళల బృందం విశ్వక్రీడల బెర్త్ దక్కించుకుందంటే.. అందులో ఆమెదే అగ్రతాంబూళం బ్యాటన్ అందుకున్న మరుక్షణమే మెరుపు వేగాన్ని అందిపుచ్చుకున్న ఆ అమ్మాయే.. దండి జ్యోతిక శ్రీ. ట్రాక్‌పై చిరుతను తలపించిన జ్యోతిక ప్రదర్శన చూసిన వారెవరైనా ఈ అమ్మాయి అద్భుతం అనక మానరు. సాధారణంగా రిలే జట్టులో ఆరంభంలో, చివర్లో పరిగేత్తే అథ్లెట్లు అత్యంత వేగంతో పరుగు తీయడం ఆనవాయితీ కాగా.. సోమవారం జరిగిన రిలే పోటీల్లో రెండో స్థానంలో బరిలోకి దిగిన జ్యోతిక రికార్డులు తిరగరాసింది.
తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కన్నా.. ఎంతో మెరుగైన టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 23 ఏళ్ల జ్యోతిక.. కన్నతండ్రి కలను నిజం చేయడం కోసం తాను అథ్లెట్‌గా మారినట్లు చెప్పింది. 400 మీ రిలేలో జాతీయ చాంపియన్ అయిన జ్యోతిక ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అండర్ నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో 400 మీటర్ల రిలేను 53.05 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జ్యోతిక 400 మీటర్ల రిలేలో ఎప్పుడు పోటీ పడినా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ రిలేలోనూ జ్యోతిక తన లెగ్‌ను 51.36 సెకన్లలో పూర్తి చేసి.. భారత జట్టు పారిస్ బెర్త్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించింది. మోకాలి గాయం కారణంగా 2022 ఆసియా గేమ్స్‌కు దూరమైన జ్యోతిక.. తండ్రి ప్రోత్సాహంతో వేగంగా కోలుకొని తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టింది.
- విజయక్రాంతి, ఖేల్ విభాగం






