విజృంభిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్
ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం, వాయు కాలుష్యం వల్ల వస్తుంది. ఒక వైపు మన ప్రభుత్వాలు, మరోవైపు సామాజిక మాద్యమాలు, ఇతరాత్ర ప్రజల శ్రేయస్సు కోరే సామాజిక సేవా సంస్థలు గొంతెత్తి ఘోషిస్తున్న అవేవి లెక్క చేయకుండా ధూమపాన ప్రియులు విచ్చలవిడిగా పొగ ఊదుతూ, దమ్ము మీద దమ్ము కొడుతూ మైమరచిపోయి ఊపిరితిత్తుల క్యాన్సర్ అనే అత్యంత అపాయకర వ్యాధి బారిన పడుతున్నారు.
అంతేకాదు ధూమపానం తో పాటు వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే పొగ సైతం కాలుష్యంగా మారి ఎంతో అమూల్యమైన మనుషుల ప్రాణాలను సైతం కాటు వేస్తుండటం కడు శోచనీయం. మానవాళి ప్రాణాలను వున్న ఫలంగా హరించి వేస్తున్న ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను కట్టడి చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తున్నాయి.
ఈ ధూమపానం, వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహనతో కూడిన సామాజిక సందేశాన్ని ఇచ్చేందుకు నడుంబిగించడం ఎం తైనా హర్షణీయం. ధూమపానం చేసేవారిలో చేయనివారి కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24 నుంచి 35 రేట్లు ఎక్కువగా ఉంటుందని, పాసివ్ స్మోకింగ్ ద్వారా ప్రతి ఏడాది 3.5 శాతం క్యాన్సర్ బారినపడుతున్నారని వైద్యులు ధ్రువీకరించడం ప్రజానీకం ఆలోచించాలి.
నిరంతరం దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం, శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గిపోవడం, ఎముకల నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనపడినప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్సను తీసుకుంటే మేలు. క్యాన్సర్ రకాన్ని గుర్తించేందుకు టిష్యూ బయాప్సీ అవసరమే.వ్యాధి ముదిరి పాకాన పడిన తరువాత వైద్యులను సంప్రదించినా.. మన ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. అందుకే ధూమపానం, వాయు కాలుష్యానికి దూరంగా ఉండి మన విలువైన ప్రాణాలను మరో పది కాలాల పాటు కాపాడుకుందాం!
కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి




