5 March, 2026 | 3:24 AM

పరాయి భాషల ప్రభావంలేని అచ్చతెలుగు పాట ఇది

05-03-2026 01:46 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ 

బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌గా ‘రై రై రా రా’ పాటను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఇది రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఈ సినిమా ముచ్చట్లను, పాట విశేషాలను పంచుకున్నారు గీత రచయిత అనంత శ్రీరామ్.

‘రై రై రా రా’ పాటకు ఇంతటి స్పందన రావడం.. ఈ పాట ఆ అదృష్టాన్ని చేసుకుందనిపించింది. ఈ పాటను చరణ్‌కు వినిపిస్తే, నన్ను హత్తుకున్నారు. పాట సాహిత్యం ప్రబోధాత్మకంగా ఉండాలని, ఇందులో వాడే భాష వ్యావహారికంగా ఉండాలని, చెప్పే విషయం లోతుగా ఉండాలని బుచ్చిబాబు సూచించారు.  ఆ మాట నాకు తారకమంత్రం అయింది. తన జట్టు ఆటగాళ్లను రయ్యంటూ రారా అని పిలిచేలాగా వుండాలని బుచ్చిబాబు చెప్పారు. ఆ మాటల దగ్గర నుంచే పాట ప్రారంభించాను. శ్రీశ్రీ గేయ ప్రక్రియను అనుసరించి, గేయ కవితలా రాశాను.  

మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడమనేది కత్తి మీద సాములా అనిపించింది. పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. పరాయి భాషల ప్రభావం లేని అచ్చ తెలుగు పాటిది. పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భం రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లేనని చెప్తుంటా. ఆ లక్షణం ఈ పాటకు ఉంది. 

ఇండస్ట్రీలో అవకాశం రావడం కష్టం, మొదటి విజయం రావడం ఇంకా కష్టం,  విజయాల్ని కొనసాగించడం మరీ కష్టం. ఏటా ఒక చార్ట్‌బస్టర్ హిట్ వస్తుందంటే.. అది తల్లిదండ్రులు వేసిన పునాది. ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా మార్చుకోవాలనే తపన. ఈ నిలకడే నా విజయం. షేర్స్, లైక్స్, వ్యూస్.. ఇలా విజయానికి కొలమానాలు ట్రెండ్‌ను బట్టి మారుతుంటాయి.. కానీ నిలకడ మాత్రం మనం కొనసాగిస్తూ ఉండాలి.

పాటలు రాస్తున్నప్పుడు నేను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ డైరెక్టర్లకు నచ్చి అలా ఓ క్యారెక్టర్‌కు నేను సరిపోతానంటే వాళ్లు చెప్తుంటారు. నేనూ సరదాగా చేస్తుంటా. అంతేకానీ, ప్రత్యేకంగా నటనపై నాకు దృష్టి లేదు. వచ్చినప్పుడు మాత్రం చేస్తా.