జిల్లా డీఈవోగా మాధవి బాధ్యతల స్వీకరణ
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి మాధవి అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా సోమవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు. కాగా ఇదివరకు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఇంచార్జి డీఈఓగా వ్యవహరించగా.. మాధవి కి ప్రభుత్వం విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు సోమవారం ఆమె తన చాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు.
అంతకు ముందు నూతన డీఈవో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ను మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో పాఠశాలల పునః ప్రారంభం నేపధ్యంలో అన్ని ఏర్పాట్లు చేపడతామన్నామని నూతన డీఈవో తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలు, పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుండే పాఠశాలల్లో అల్పాహారాన్ని ప్రారంభించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి లోటుపాట్లు లేకుండా చూస్తామన్నారు. విద్యార్థులకు అందించేలా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.






