24-02-2026 12:00:00 AM
కూడలిలో ఇసుక డంప్ చేసిన మాఫియా
ఒక్కో ట్రాక్టర్ ట్రక్కు రూ. 7 వేలకు అమ్ముతున్న వైనం
పక్క గ్రామాలకు ఇసుక కరువు..
అక్రమార్కులకు ఇసుకే బతుకు దెరువు
పట్టించుకోని అధికారులు
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు
మోతె, ఫిబ్రవరి 23 : కూడలి వాగుకు ఓ వైపు ఖమ్మం జిల్లా సోలిపురం రెవెన్యూ గ్రామం ఉండగా, జిల్లాలోని కూడలి గ్రామం మరో వైపు ఉంది. ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న వాగు వెంబడి నుంచి ఇసుకను తరలిస్తే తిరుమలాయపాలెం మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని వేలం నిర్వహిస్తున్నారు. దీంతో రాత్రి వేళ అక్రమార్కులు వాగు అవతలి నుంచి ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకొచ్చి కూడలిలో నిల్వ చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నా రు. ఇసుకను నిల్వచేస్తున్నా, తరలిస్తున్నా మోతె మండల రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది.
ఇసుక వ్యాపారులు మాపీగా ఏర్పడి రెవెన్యూ, పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటం వల్లే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మాఫీయాలో లేని కొత్త వ్యక్తులు ఇసుక తరలిస్తే మాత్రం పోలీసులు పట్టుకొని కేసు నమోదుచేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులే చెబుతున్నారు. వాగులో అవకాశమున్న మేర గోతులు తీసి ఇసుకను తరలిస్తున్నారు.
కొందరిపైనే కేసులు
ఇటీవల కూడలి వాగు నుంచి కొందరు ఎక్స్కవేటర్ సహాయంతో ఇసుక తోడి ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు తీసేసి తరలిస్తుండటంతో మోతె పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి రాత్రిపూట దాడులు నిర్వహించారు. గ్రామస్థుల సమక్షంలో నాలుగు ఇసుక ట్రాక్టర్లు, రెండు ఎక్స్కవేటర్లను స్టేషన్కు తరలిస్తుండగా, ఓ పార్టీ నేత ఫోన్ చేసి రెండు ట్రాక్టర్లు తమవారివని చెప్పడంతో వాటిని పోలీసులు వదిలేశారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మిగతా రెండు ట్రాక్టర్లు, రెండు ఎక్స్కవేటర్లపై కేసు నమోదుచేసి నాలుగు రోజుల్లో వాటిని విడుదల చేశారు. ఇదేంటని నిలదీసిన గిరిజన నాయకుడిపై పోలీసులు దాడికి దిగడంతో అతడు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పక్క గ్రామాలకు ఇసుక కరువు
కూడలి వాగు సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండగా, పక్క గ్రామాల ప్రజలు ఇంటి నిర్మాణాలు చేయాలంటే మాత్రం ఇసుక దొరకడం లేదు. వాగువెంట ఉన్న రైతులు ఇసుకను అక్రమార్కులకు విక్రయిస్తున్నారని, స్థానికులు ఇసుక తరలిస్తే మాత్రం అడ్డుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల మండలంలో రోడ్డు నిర్మాణ పనులు, చెరువుకట్టల వెంట, ఎస్సారెస్పీ కాల్వల వెంట కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. వాటికి వందల ట్రిప్పుల ఇసుక అవసరం కాగా, అక్రమార్కులు అధికారపార్టీ నాయకుల అండతో ఇసుకను ఇక్కడి నుంచి తరలించి లక్షల రూపాయలు దండుకున్నారు.
మాఫీయాలోని వ్యక్తులుగాక, ఇతరులు ఇసుక తరలిస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు నమోదు చేయిస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కూడలి గ్రామంలో 50కి పైగా ప్రదేశాలలో డంపులు, ఊరచెరువులో, శ్మశానవాటిక వద్ద సైతం ఇసుక డంపులు ఉన్నాయి. వాగుకు పక్క గ్రామం సోలిపురంలో వందల ట్రాక్టర్ల ఇసుకను డంపు చేశారని పోలీస్, రెవెన్యూ అధికారులు ఆ డంపులను సీజ్ చేసి వేలం వెయ్యాలని గ్రామస్తులు చెబుతున్నారు. అదేవిధంగా డంపు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
అనుమతులు లేకుండా ఎవరు ఇసుకని రవాణా చేసిన, అక్రమంగా నిల్వచేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. తాసిల్దార్ తో కలిసి పరిశీలనలు చేసి డంపు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
- అజయ్ కుమార్, ఎస్త్స్ర, మోతె