8 March, 2026 | 1:21 AM

ఎదనిండా భక్తిభావం

07-03-2026 12:33 AM

తనువంతా తన్మయత్వం

మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

భారీగా తరలివచ్చిన భక్తజనం

భక్తులతో కిక్కిరిసిన ఆలయం 

నేటితో ముగియనున్న జాతర

మంగపేట, మార్చి 6 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో జరుగుతున్న మహా జాతరకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి నాగులమ్మ పగిడిద్దరాజుల కల్యాణం అనంతరం తెల్లవారుజాము న ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ) లోక కల్యాణం కోసం అగ్ని గుండంలో నడుస్తున్న సమయంలో భక్తులు చేసిన నాగులమ్మ తల్లి నామ స్మరణతో జాతర ప్రాంగణం మారు మ్రోగిపోయింది.

శుక్రవారం ఉదయం ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్, బాడిశ నవీన్, ఇతర పూజారులు నాగులమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి భక్తులు నాగులమ్మ జాతరకు తరలివచ్చారు. నాగులమ్మ దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులతో శుక్రవారం ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

అమ్మవారిని దర్శించుకున్న భక్త జనం తనువంతా తన్మయత్వం అయ్యారు. పసుపు - కుంకుమ, కొబ్బరికాయ, ఒడి బియ్యం అమ్మవార్లకు సమర్పించి తమ కోర్కెలు తీర్చాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. జాతరకు తరలి వచ్చిన భక్త జనం మమ్ము చల్లంగా చూడు తల్లీ అంటూ నాగులమ్మను వేడుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివ సత్తుల పూనకాలతో ఆలయ ప్రాం గణం దద్దరిల్లింది. మంగళవారం ప్రారంభమైన నాగులమ్మ మహా జాతర నేటి (శనివారం ) తో ముగియనుంది.