10 August, 2026 | 2:02 PM

నాగార్జునసాగర్​లో మహా వరుణయాగం

10-08-2026 12:52 PM

యాగపూజలలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ దంపతులు.                                               

పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం.

నల్లగొండ బ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి) :  రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, నీటి కొరత తొలగాలని, పంటలు బాగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణ దేవునికి పూజ నిర్వహిస్తుంటారు. అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరుణయాగం జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు నాగార్జునసాగర్‌లోని విజయ్‌ విహార్‌ ప్రాంగణంలో 108 పంది రుత్వికులు 11 హోమ గుండాలతో ప్రత్యేక వైదిక క్రతువు నిర్వహిస్తున్నారు. ఈ తంతును తెల్లవారుజామున 4 గంటలకు ఆది పూజచేసి యాగాన్ని(Maha Varuna Yagam) ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వం వహించారు. అలాగే ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి యాగపూజలు నిర్వహించారు. ఈ క్రతువు సాయంత్రం వరకు కొనసాగనుంది.

పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం :  ఈ మహా క్రతువులో పాల్గొనేందుకు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 2 : 45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకొన్నారు. అక్కడి నుంచి విజయ విహార్ గెస్ట్ హౌస్ కు చేరుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలోని కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎస్ సమృద్ధిగా వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహాలు పెరగాలని, రైతాంగంకు పంటలు బాగా పండి సుభిక్షంగా ఉండాలని కోరుతూ సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. యాగం ముగిసిన తదుపరి సీఎం తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారని అధికారులు తెలిపారు.