11-02-2026 02:42:52 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థి మహదేవప్పది ఆత్మహత్య కాదని, అది కాంగ్రెస్ చేసిన హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కాంగ్రెస్‌ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందని, తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై యుద్దం చేయబోతున్నామన్నారు.
బీఆర్‌ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాయని, బీజేపీ కార్యకర్తలారా....ధైర్యంగా ఉండండి... బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉందన్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షాంచాలని ఆయన డిమాండ్ చేశారు.