గుర్రంగూడ రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
త్వరలోనే 150 ఫీట్ల రహదారి పనులు
బడంగ్‌పేట్, ఫిబ్రవరి 10( విజయక్రాంతి): గుర్రంగూడ రోడ్డు విస్తరణలో నెలకొన్న చిక్కుముడులు ఎట్టకేలకు వీడనున్నాయి. సాగర్ హైవే నుండి గుర్రంగూడ మీదుగా నాదర్గుల్ వరకు చేపట్టదలచిన 150 ఫీట్ల రోడ్డు విస్తరణకు అటవీ శాఖ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్ డీసీ పి. సరస్వతి వెల్లడించారు.
సాగర్ హైవే సమీపంలోని అటవీ భూముల వద్ద ఫారెస్ట్ అధికారులు ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం గోడ నిర్మిస్తే, భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు ఆటంకం కలుగుతుందని, తద్వారా స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు.
అధికారుల మధ్య చర్చలు
ఈ విషయంపై డీసీ సరస్వతి మంగళవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రోడ్డు విస్తరణ ఆవశ్యకతను వారికి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నిబంధనల మేరకు అటవీ భూములను సంరక్షిస్తూనే పనులు చేపడతాం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రోడ్డు విస్తరణకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తాం అని చెప్పారు.
విస్తరణకు ఇబ్బంది కలగకుండా ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, ఆనంద రెడ్డి, జి. భాస్కర్ రెడ్డి, జక్కిడి జంగారెడ్డి, శ్రీరామ్ రెడ్డి, శంకర్, బాలాజీ, జే. సుధాకర్ రెడ్డి, లింగారెడ్డి, ఆనంద్, శేఖర్, గుర్రం సాయి రెడ్డి, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, పవన్, గుర్రం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




