9 June, 2026 | 2:45 AM

మహారాష్ట్ర ధాన్యం తెలంగాణకు

09-06-2026 01:41 AM
  1. లారీల్లో నేరుగా తరలింపు
  2. మంచిర్యాలకు తెస్తున్న అక్రమార్కులు
  3. అక్కడ క్వింటాలుకు రూ. 600కే కొనుగోలు
  4. ఇక్కడ ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మకాలు
  5. కలెక్టర్ హెచ్చరించినా పట్టించుకోని అధికారులు

మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రానికి సమీప మహారాష్ట్ర నుంచి లారీల్లో టన్నుల కొద్ది ధాన్యం వచ్చి చేరుతుం ది. ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, ఎంత మంది సిబ్బందిని భద్రతగా ఉంచినా వచ్చి చేరుతుండటం గమనార్హం. ఓ వైపు మంచిర్యాల జి ల్లాలో రైతులు పండించిన ధాన్యం మిల్లులకు, గోదాములకు తరలించేందుకు జిల్లా కలెక్టర్ నానా తంటాలు పడుతూ మంచిర్యాల జిల్లాతో పాటు పక్క జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని గోదాములు, మిల్లులకు ధాన్యం పంపిస్తు న్నారు.

కానీ అక్రమార్కులు ఇచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ చెక్‌పోస్టు అధికారులు, సిబ్బంది ఇలా లారీలకు లారీలనే చెక్ పోస్టులు దాటిస్తున్నారని తెలుస్తున్నది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సిరోంచ, అంకీత, ఆశరెల్లి, నగరం, మద్దికుంట, రామంజపూర్, హైరీ, ఆళ్లపల్లి, టేకడా, అరుడ, జానంపల్లి, బమ్మెన, ది మ్మలగడ్డు, గడ్చిరోలి, భూపాలపట్నం ప్రాంతా ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు.

జిల్లా కలెక్టర్ మహారాష్ట్ర సరిహ ద్దు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అసలు కల్లాల్లో ధాన్యం కనిపించడం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడాలని అధికారులను పలుమార్లు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

తక్కువకు కొని మద్దతు ధరకు అమ్మకం

పక్క రాష్ట్రాలలో ఉన్న టెండర్ ధాన్యంను తక్కువ ధరకు పాడుకొని సీజన్‌లో తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు విక్రయిస్తూ లక్షల్లో దండుకుంటున్నట్లు సమాచారం. అక్కడ క్వింటాలుకు రూ.600 నుంచి రూ. 700లకు కొనుగోలు చేసి తెలంగాణలో క్వింటాలుకు రూ.2,369 ధరకు విక్రయిస్తున్నారు. చివరి గింజ వరకు కొంటామంటున్న నాయకులు, అధికారులు పక్క రాష్ట్రం ధాన్యం కొంటున్నారే తప్పా మన ది కాదన్నది తెలుస్తోంది. దీనికి ప్రత్యేక ఉదాహరణే వారం రోజుల కిందట పట్టుబడ్డ లారీ అని చెప్పవచ్చు. 

ధాన్యం పంపుతున్నది ‘రేషన్’ వీరయ్యేనా?

ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో రేషన్ మహారాష్ట్రకు తీసుకెళ్లే రేషన్ వీరయ్యే మహారాష్ట్ర నుంచి ధాన్యం టెండర్ పాడి తెలంగాణలోని మహారాష్ట్ర సమీప జిల్లాలైన మంచి ర్యాల, కుమ్రంబీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు లారీలకు లారీలు తన అనుచరులతో పంపిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో క్వింటాలుకు రూ. 1500 నుంచి రూ. 1700లకు కొందరు మధ్యవర్తులకు లారీలకు లారీలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. వా రం కిందట వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన లారీ వెనక సైతం అతనే ఉన్నట్లు సమాచారం. ఈ విషయ మై కోటపల్లి సీఐని ఫోన్‌లో సంప్రదించే ప్రయ త్నం చేయగా స్పందించలేదు.