మానకొండూర్ రోడ్లకు మహార్దశ
రహదారుల దుస్థితిపై కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి పరిశీలన
మానకొండూరు, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మానకొండూరు మండల కేంద్రం, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, లక్ష్మీపూర్, వేగురుపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారిందని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి మంగళవారం పర్యటించి రోడ్ల దుస్థితిని పరిశీలించారు. మార్గమద్యంలో దెబ్బతిన్న రోడ్లను, ప్రమాదకరంగా మారిన కల్వర్టులు, వంతెనలను వారు పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ రోడ్ల పరిశీలనకు వచ్చారన్నారు. రోడ్ల దుస్థితిని ప్రత్యక్షంగా చూడటం వల్ల జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమస్య తీవ్రతను గుర్తించి సమస్య నివారణకు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఫలితంగా త్వరలోనే ఈ మార్గంలో కొత్త రోడ్లు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. దీంతో ఈ రోడ్లకు మహర్దశ పట్టే యోగం ఉందన్నారు. త్వరలోనే కొత్త రోడ్డు వేసేందుకు ప్రభుత్వపరంగా అనుమతి లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, మానకొండూర్ తహశీల్దార్ విజయ్ కుమార్, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ద్వావ శ్రీనివాస్ రెడ్డి, మడుపు ప్రేమ్ కుమార్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, పెంచాల కిషన్ రెడ్డి, బుర్ర శ్రీకాంత్, గుజ్జ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




