calender_icon.png 15 February, 2026 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షెట్టిపేటలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

15-02-2026 12:43:48 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పట్టణ సమీపంలోని గోదావరి నది ఘాట్‌కు భారీగా తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి తీరాన గల గంగమ్మ తల్లిని దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల సౌకర్యార్థం లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఘాట్ వద్ద స్నానాల కోసం షవర్లు, దుస్తుల మార్పిడి గదులు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ తెలిపారు.

పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీసు పెట్రోలింగ్ నిర్వహించారు. గోదావరి స్నానాల అనంతరం భక్తులు పట్టణంలోని శ్రీ సాంబశివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రాతఃకాల పూజలు, రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, శ్రీమద్భగవద్గీత పారాయణం, సుప్రభాత సేవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొత్తంగా లక్షెట్టిపేటలో మహాశివరాత్రి పండుగ ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగింది.