ప్రకృతి ప్రేమికులకు మహతే దేవాయ ఫౌండేషన్ అండ
ప్రకృతి ప్రకాష్, చిన్నారి ప్రకృతి బ్లెస్సికి రూ.10 వేల ఆర్థిక సహాయం
కోనరావుపేట, జూలై 9 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికులు ప్రకృతి ప్రకాష్, ఆయన కుమార్తె చిన్నారి ప్రకృతి బ్లెస్సి చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మహతే దేవాయ ఫౌండేషన్ అండగా నిలిచింది. వారి సేవా కార్యక్రమాలను గుర్తించి ఫౌండేషన్ రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించింది.సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలోని ప్రకృతినివాస్ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహతే దేవాయ ఫౌండేషన్ సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేషంగా పనిచేస్తోంది. చిన్ననాటి నుంచే ప్రకృతి పచ్చదనం, అడవుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న చిన్నారి ప్రకృతి బ్లెస్సి చెట్ల కింద రాలిన విత్తనాలను సేకరించడం, అల్లనేరేడు విత్తనాలను కొనుగోలు చేసి విత్తన బంతులు తయారు చేయడం, వాటిని డ్రోన్ల సహాయంతో అడవుల్లో వెదజల్లడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ సేవలను అభినందించిన మహతే దేవాయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ వత్సవాయి రవి కుమార్ ప్రకృతి ప్రకాష్‌ను సంప్రదించి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ప్రకృతి సంరక్షణ కోసం చిన్న వయసులోనే బ్లెస్సి చూపుతున్న అంకితభావం, ఆమెకు మార్గనిర్దేశం చేస్తున్న ప్రకృతి ప్రకాష్ సేవా స్పూర్తి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సహకారాన్ని కేవలం ఆర్థిక సాయంగా కాకుండా ప్రకృతి పరిరక్షణ ఉద్యమానికి శుభారంభంగా భావిస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. "ప్రకృతి కోసం ఒక అడుగు... భావితరాల కోసం ఒక ఆశ... ప్రతి చెట్టు ఒక జీవితం" అనే సందేశంతో మరింత మంది పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా చిన్నారి ప్రకృతి బ్లెస్సి మాట్లాడుతూ, తమ పర్యావరణ సేవలను గుర్తించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించిన మహతే దేవాయ ఫౌండేషన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






