రైతన్నపై ప్రకృతి కన్నెర్ర..
కల్లాల్లో తడిసి ముద్దైన ధాన్యం..
కేంద్రాల్లో నీటి పాలైన మొక్కజొన్నలు..
కన్నీటి పర్వతమైన రైతులు
కూసుమంచి, మే 4 (విజయక్రాంతి): భానుడి భగభగలపై ప్రకృతి వర్షపు తిరుగుబాటు చేసింది.. నిప్పుల కొలిమిలా మారిన నేలపై అమృతపు చినుకులు కురిశాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనానికి వానదేవుడి వరమిచ్చింది.. కానీ.. రైతన్న పాలీట శాపంగా మారింది.. అకాల వర్షం రైతులను నట్టెట ముంచేసింది.. నోటికందే దశలో పంటను వర్షం నీటిపాలు చేసింది.. ఉన్నట్లుగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మనుషులు ఒక్క అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి.. ఆదివారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా తన స్వరూపం మార్చుకుంది. నల్లని మేఘాలు నెమ్మదిగా భూమిని కమ్ముకుంటూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు భారీ వర్షం కురిసింది. ప్రకృతి తన కరుణ చూపితే ఎంతటి ఎండనైనా ఓడించగలదని ఈ వర్షపు జల్లులు మరోసారి గుర్తుచేశాయి.
తడిసిన ధాన్యం.. మొక్కజొన్నలు
ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం అద్భుతం జరిగింది. ఉరుములు , మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దైయ్యాయి. కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటుచేసిన మొక్కజొన్నలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. కేంద్రాల్లో, కల్లాల్లో ఏర్పాటు చేసుకున్న వరి ధాన్యం వర్షార్పణం అయ్యాయి. ఆ పంటను రక్షించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టాల కోసం పరుగులు పెట్టారు. అయినప్పటికి ఒక్కసారిగా వర్షం కురవడంతో ధాన్యం, మొక్కజొన్నలు కల్లా లోనే తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
నేల పాలైన పంటలు..
ఆకాల వర్షానికి పంటలు తడిసిపోగా, కొన్ని పంటలు నేలపాలైయ్యాయి. వరి, చెరకు, మిర్చి పంట నేలపై పడిపోయింది. మామిడి, నిమ్మ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేల పాలైయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఆందోళన చేస్తున్న రైతన్నలు
కల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతన్న గుండె బరువెక్కింది. ఆవేదనతో రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.. పాలేరు, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం, మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.






