పుదుచ్చేరిలో ఎన్డీయే విజయకేతనం
- ౩౦ స్థానాల్లో ౧౮ స్థానాలు కైవసం
- ఆరోసారి సీఎంగా రంగసామి ?
- కాంగ్రెస్ ఖాతాలో ఆరు స్థానాలు
- మరో రెండు టీవీకే సొంతం
- మరో మూడు చోట ఇతరుల విజయం
పాండిచ్చెరి, మే ౪: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ఘనవిజయం సాధించింది. మొత్తం 30 స్థానాలున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మేజిక్ ఫిగర్ 16 కాగా, ఆ ఫిగర్‌ను ఎన్డీయే కూటమి సులభంగా అధిగమించి 18 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఆరు సీట్లు, టీవీకే రెండు సీట్లు, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందాయి. ఎన్.రంగసామి థట్టంచావడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. కామరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎల్‌జేకే వ్యవస్థాపకుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు స్థానాలను గెలుచుకోవడం విశేషం. రాజ్‌భవన్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి విగ్నేష్ కన్నన్ తన సమీప బీజేపీ అభ్యర్థిపై కేవలం 287 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
ఐదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి
ముఖ్యమంత్రి ఎన్.రంగసామి నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్సీ) ఎంతో శ్రమించి ఎన్డీయే కూటమికి ఘన విజయం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగియనుండగా, అంతకంటే ముందే అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రంగసామి ఐదోసారి సీఎం పదవిని అలకరించనున్నారు. గత 2021 ఎన్నికల్లో ఏఐఎన్‌ఆర్సీ అధినేత రంగసామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. రంగసామికి చెందిన ఏఐఎన్‌ఆర్‌సీ 10 సీట్లు సాధించగా, మిత్రపక్షం బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
యానాంలో మల్లాడి ఘనవిజయం.. ఆరోసారి ఎమ్మెల్యేగా రికార్డు
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాం. ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో చివరికి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. ఈ విజయంతో ఆయన ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై యానాం రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఇద్దరి మధ్య గట్టి పోటీ నడిచింది.
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. మొదటి రెండు రౌండ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ స్వల్ప ఆధిక్యంలో నిలిచారు. అయితే మూడో రౌండ్ నుంచి పరిస్థితి తారుమారైంది. రీ ముగిసే సరికి మల్లాడి ముందంజలోకి వచ్చారు. 4, 5 రౌండ్లలో ఆయన తన దూకుడు ప్రదర్శించి మెజారిటీని పెంచుకున్నారు. మల్లాడి కష్ణారావు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.






